వామ్మో.. ఈ చాయ్‌ల ధరలు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.. కిలో పౌడర్ లక్షలు కాదు కోట్లలో..
చాలా మందికి చాయ్ తాగనిదే రోజు గడవదు. మన దగ్గర కిలో టీ పౌడర్ రూ. 500 నుంచి రూ. 1500 వరకు ఉంటుంది. కానీ ప్రపంపంచలోనే అత్యధిక ధర కలిగిన టీ పౌడర్ ఏంటో తెలుసా..? దాని ధర లక్షల్లో కాదు కోట్లలో ఉంటుంది.

హే ఛాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఈ ఛాయ్ చెమక్కులే చూడరా భాయ్.. అంటూ చిరంజీవి సినిమాలోని పాట మన నోళ్లలో ఇప్పటికీ నానుతూనే ఉంది. చాయ్ లేకపోతే మైండే పనిచేయదు. ఒక్క చాయ్ తాగితే ఆ కిక్కే వేరు. ఏది ఉన్నా లేకున్నా చాయ్ ఉండాల్సిందే. మనిషితో చాయ్ అంతలా పెనవేసుకపోయింది. అయితే సాధారణ టీ ఫౌడర్ కిలో రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. కొన్ని వేలల్లో ఉంటాయి. కానీ కొన్ని కొన్ని టీ పౌడర్లు కొనాలంటే కోట్లు చెల్లించాల్సిందే. అవును..ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన టీల ధర చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రపంచంలోని ఐదు అత్యంత ఖరీదైన టీలు, వాటి ధరలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డా హాంగ్ పావో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ ఇది. దీని కిలో ధర సుమారు రూ. 10,57,80,000 ( 10 కోట్ల 57 లక్షల 80వేలు). ఈ టీ 350 సంవత్సరాలకు పైగా పురాతనమైన చెట్ల నుండి తయారవుతుంది. చైనాలోని పొగమంచుతో కూడిన కొండ ప్రాంతాలలో పెరిగే ఈ చెట్లు, టీకి ఒక ప్రత్యేకమైన ‘యాన్-యున్’ అనే రుచిని ఇస్తాయి. చైనాలోని మింగ్ రాజవంశం నుండి దీనికి గొప్ప చరిత్ర ఉంది. ఇది చాలా అరుదుగా లభిస్తుంది. చైనాలో ఈ టీని ఒక నిధిగా భావిస్తారు.
పాండా డంగ్ టీ
ఈ పేరు వినగానే ఆశ్చర్యం కలగక మానదు. దీని కిలో ధర సుమారు రూ.61,70,500( 61 లక్షల 70 వేల 500 రూపాయలు). ఈ టీని పెంచడానికి రైతులు పాండా వ్యర్థాలను ఎరువుగా ఉపయోగిస్తారు. పాండాలు కేవలం వెదురు మాత్రమే తినడం వల్ల, వాటి వ్యర్థాలు పోషకాలతో నిండి ఉంటాయి. ఈ పోషకాలు టీ మొక్కలు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. ఇది ఈ టీని ప్రత్యేకంగా, అత్యంత ఖరీదైనదిగా చేస్తుంది.
పిజి టిప్స్ డైమండ్ టీ బ్యాగ్
ఈ టీ రుచి కంటే దాని విలాసానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఒక్క టీ బ్యాగ్ ధర సుమారు రూ.13,22,250. పిజి టిప్స్ కంపెనీ తమ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దీనిని తయారు చేసింది. ఈ టీ బ్యాగ్‌ను 2.56 క్యారెట్ల వజ్రాలతో అలంకరించి, బంగారు గొలుసును జత చేశారు. ఇందులో భారత్ నుండి సేకరించిన సిల్వర్ టిప్ టీ ఆకులు ఉంటాయి. దీనిని యూకేలోని పిల్లల ఆసుపత్రికి నిధులు సేకరించేందుకు ఉపయోగించారు.
వింటేజ్ నార్సిసస్ ఊలాంగ్
చైనా నుండి వచ్చిన ఈ ప్రత్యేకమైన ఊలాంగ్ టీ కిలో ధర సుమారు రూ.6,31,643. గ్రీకు పురాణాలలోని అందమైన పాత్ర అయిన నార్సిసస్ పేరు దీనికి పెట్టారు. ఈ టీని చాలా సంవత్సరాలు నిల్వ ఉంచుతారు. దీని వల్ల ఇది గొప్ప, మృదువైన రుచిని, బలమైన సువాసనను కలిగి ఉంటుంది.
టైగ్వానీన్ ఊలాంగ్
చైనాలోని ఫుజియాన్ నుండి వచ్చిన మంచి నాణ్యత గల ఊలాంగ్ టీ కిలో ధర సుమారు రూ.2,91,489. దీనిని 1800 కాలం నుంచి సాగు చేస్తున్నారు. ఈ పేరుకు ‘‘ఐరన్ గాడ్డెస్ ఆఫ్ మెర్సీ’’ (కరుణామయి అయిన దేవత) అని అర్థం. ఈ టీని రోలింగ్, ఎండబెట్టడం, వేయించడం వంటి ప్రత్యేకమైన తయారీ ప్రక్రియ ద్వారా రూపొందిస్తారు. వసంతకాలంలో లభించే టీ చాలా ఉత్తమమైనది, ఖరీదైనది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
