వరుణ్ తేజ్
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు వరుణ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు, పద్మజల ఏకైక కుమారుడు. 1991 జనవరి 19న హైదరాబాద్లో జన్మించాడు. చిన్నవయుసులోనే తన తండ్రి నటించిన హ్యాండ్స్ అప్ చిత్రంలో బాలనటుడిగా కనిపించాడు వరుణ్. ఆ తర్వాత 2014లో ముకుంద సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత 2015లో విడుదలైన ‘కంచె’ సినిమా వరుణ్ తేజ్‌కు భారీ విజయాన్ని అందించింది. అంతేకాదు..ఇందులో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ వెంటనే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ సినిమాతో మరో హిట్ వరుణ్ ఖాతాలో చేరింది. దీంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో వరుణ్ తేజ్‌కు మరింత క్రేజ్ పెరిగింది. ఫిదా తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ అచి తూచి అడుగులు వేస్తున్నాడు వరుణ్. అలాగే గద్దలకొండ గణేష్ సినిమాతో మాస్ హీరోగా.. ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలతో తన కామెడీ టైమింగ్తో అలరించాడు.
గతేడాది హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఏడుగులు వేశాడు వరుణ్ తేజ్. 2017లో వచ్చిన మిస్టర్ సినిమాలో లావణ్య, వరుణ్ కలిసి నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాదాపు ఆరేళ్లు తమ ప్రేమ విషయాన్ని బయటకు రానివ్వకుండా చూసుకున్నారు. అయితే 2023 జూన్లో వీరిద్దరి నిశ్చితార్థం జరగడంతో వరుణ్, లావణ్య ప్రేమ విషయం బయటకు వచ్చింది. అదే ఏడాది నవంబర్ 1న వీరిద్దరి వివాహం ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో ఇటలీలో గ్రాండ్గా జరిగింది.