రతన్ టాటా
1937 డిసెంబర్ 28న ముంబయిలో నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్ టాటా.. కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్ డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్ టాటా.. 1962లో టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించింది.