నారా లోకేశ్
నారా లోకేశ్ ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు. నారా లోకేశ్ 1983 జనవరి 23న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజిమెంటు ఇన్ఫర్‌మేషన్ సిస్టమ్స్ విభాగంలో బి.ఎస్సీ చేసారు. అనంతరం స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.ఎ చేశారు.
తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలోని నగదు బదిలీ పథకమును నారా లోకేశ్ సూచించినట్లు చెబుతారు. నారా లోకేశ్ మే 2013లో టీడీపీలో చేరారు. అతడు తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. గతంలో ఆయన హెరిటేజ్ ఫుడ్స్ కు మేనేజింగ్ డైరెక్టెర్‌గా పనిచేశాడు. ఆయన 2017 మార్చి 30లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికై ఆ తర్వాత రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గము నుండి పోటీ చేసి తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు లక్ష్యంతో ఏపీలోని 97 నియోజకవర్గాల మీదుగా నారా లోకేశ్ 3,100 కిలో మీటర్ల పాదయాత్రను చేపట్టారు.
2007లో నారా లోకేశ్ తన మామ అయిన నందమూరి బాలకృష్ణ కుమార్తె నందమూరి బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు. వారికి నారా దేవాన్ష్ అనే ఏకైక కొడుకు ఉన్నారు.