Youth Voter: తలుచుకుంటే నేతల తలరాతలే తారుమారు.. ఇంతకీ వీరు ఓటు వేసేనా..?

ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశ యువత చేతిలోనే ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు యూత్‌ ఓటర్లదే కీలక భూమిక. పార్లమెంట్‌ ఓటర్లలో సగానికి సగం శాతం యువ ఓటర్లే ఉండటం విశేషం. జిల్లాల వారీగా చూస్తే అత్యధిక యువ ఓటర్లు పెద్దపల్లి, పాలమూరు జిల్లాల్లో ఉంటే.. అత్యల్పంగా సికింద్రాబాద్‌, వరంగల్‌లో ఉన్నారు. 30 నుంచి 39 మధ్య వయస్సు ఓటర్లే అత్యధికంగా ఉన్నారు.

Youth Voter: తలుచుకుంటే నేతల తలరాతలే తారుమారు.. ఇంతకీ వీరు ఓటు వేసేనా..?
Youth Vote
Follow us
Balaraju Goud

|

Updated on: May 10, 2024 | 8:58 PM

ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశ యువత చేతిలోనే ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు యూత్‌ ఓటర్లదే కీలక భూమిక. పార్లమెంట్‌ ఓటర్లలో సగానికి సగం శాతం యువ ఓటర్లే ఉండటం విశేషం. జిల్లాల వారీగా చూస్తే అత్యధిక యువ ఓటర్లు పెద్దపల్లి, పాలమూరు జిల్లాల్లో ఉంటే.. అత్యల్పంగా సికింద్రాబాద్‌, వరంగల్‌లో ఉన్నారు. 30 నుంచి 39 మధ్య వయస్సు ఓటర్లే అత్యధికంగా ఉన్నారు.

కొన్ని గంటల్లో దేశ వ్యాప్తంగా నాల్గో విడత.. తెలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో కేవలం లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలనగానే పార్టీలు, వాటి అభ్యర్థులు, వారి గెలుపు అవకాశాలు లాంటి అంశాలే సహజంగా చర్చకు వస్తుంటాయి. అత్యంత కీలకమైన ఓటర్ల గురించి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరు. మరీ ముఖ్యంగా యువ ఓటర్ల గురించి అటు పార్టీలతో పాటు ఇటు ప్రజలు కూడా పెద్దగా దృష్టి పెట్టరు. ఎంతసేపు పురుషులెంత మంది? మహిళా ఓటర్లు ఎంత మంది? అనే ఆలోచిస్తుంటారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికలో యువ ఓటర్లదే కీలక భాగస్వామ్యం కానున్నది. వారు తలుచుకుంటే నేతల తలరాతలే తారుమారవుతాయి.

తెలంగాణ రాష్ట్రం వరకే చూసుకుంటే.. ప్రస్తతం లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 3 కోట్ల 32 లక్షల 32 వేల 318 మంది ఓటర్లున్నారు. వీరిలో 18 నుంచి 39 ఏండ్ల మధ్యనున్న ఓటర్లు సుమారు కోటి 67 లక్షల పై చిలుకున్నారు. అంటే మొత్తం ఓటర్లలో సగానికన్నా కాస్త ఎక్కువేనన్నమాట. మొత్తం యువ ఓటర్లలో కూడా 18-19 ఏండ్ల మధ్య ఉన్న వారు 9.23 లక్షలున్నారు. 20-29 ఏండ్ల మధ్య వారు 67.10 లక్షల మంది ఉన్నారు. 30 -39 ఏండ్ల మధ్య వారు 91.22 లక్షలుండగా.. 40-49 ఏండ్ల మధ్యున్న వారు 69.85 లక్షల మంది ఉన్నారు. ఇక, 50-59 ఏండ్ల మధ్య వారు 47.45 లక్షల మంది ఉండగా.. 60-69 మధ్య వయస్కులు 28.58 లక్షల మంది ఉన్నారు. 70-79 ఏండ్ల మధ్య నున్న ఓటర్లు 14.36లక్షల మంది ఉండగా.. 80 ఏండ్లు పైబడిన వారు 4.47 లక్షల మంది దాకా ఉన్నట్టు గణాంకాలు తెలియచేస్తున్నాయి.

ఈ గణాంకాలు తెలియటంతో ఇప్పుడు అన్ని పార్టీలూ యువతను బుట్టలో వేసుకునే పనిలో పడ్డాయి. అంతేగాక అభ్యర్థులుగా కూడా అధిక భాగం యువకులనే బరిలోకి దింపాయి. తెలంగాణలోని పెద్దపల్లి, పాలమూరు నియోజకవర్గాల్లో అత్యధికంగా యువ ఓటర్లుండగా.. సికింద్రాబాద్‌, వరంగల్‌ నియోజకవర్గాల్లో అత్యల్పంగా యువ ఓటర్లున్నారు. అందుకే అన్ని పార్టీల ఎంపీ అభ్యర్థుల్లో అతి పిన్న వయస్కుడైన గడ్డం వంశీకృష్ణను కాంగ్రెస్‌ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీకి దింపింది.

యువ అభ్యర్థులతో పాటు రాజకీయంగా సుదీర్ఘ అనుభవమున్న వారు సైతం ఈ దఫా పార్లమెంట్‌ ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో కాంగ్రెస్‌ తరుఫున 73 ఏండ్ల మల్లురవి, 70 ఏండ్ల జీవన్‌రెడ్డి పోటీ చేస్తుండగా.. బీఆర్‌ఎస్‌ తరుఫున 70 ఏండ్ల పద్మారావు, బాజిరెడ్డి గోవర్ధన్‌లతో పాటు 69 ఏండ్ల కాసాని జ్ఞానేశ్వర్‌ పోటీ చేస్తున్నారు.

లోక్‌సభ నియోజకవర్గాలన్నింటిలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజ్‌గిరి.. ఈ నియోజకవర్గంలో యువ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయితో పాటు కేంద్ర స్థాయిలో కూడా నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో మరి యువ ఓటర్లు ఈ దఫా ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…