Minister Jagadishreddy vs MLA Rajgopal Reddy: చౌటుప్పల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి చేతిలోంచి ఆయన మైక్ లాక్కోవడం స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకోవడం గందరగోళానికి దారి తీసింది. ఈ క్రమంలో మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల మధ్య పరస్పర తోపులాట జరగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, 60 ఏళ్లలో ఏమీ చేయలేని కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
ఇదిలావుంటే, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రేషన్ కార్డు పంపిణీలో పారదర్శకత లోపించదన్నారు. రేషన్ పంపిణీలో సంస్కరణలు రావాలని సూచించారు. ప్రతి నెల రేషన్ తీసుకోవడంలో పేద ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో రాష్ట్రంలో కూడా ఇంటింటికి రేషన్ పంపిణీ చేపట్టాలని రాజగోపాల్ రెడ్డి కోరారు.
Mla Rajgopal Reddy Letter To Cm Kcr