కొత్త అజెండాతో విదేశీ పెట్టుబడులే లక్ష్యం.. దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణకు భారీ విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. జనవరి 19వ తేదీన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు సీఎం బృందం వెళ్లనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సదస్సులో పాల్గొననుంది. ఈ పర్యటనలో తెలంగాణ భవిష్యత్ పారిశ్రామిక దిశను నిర్దేశించే కీలక అజెండాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.

తెలంగాణకు భారీ విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. జనవరి 19వ తేదీన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు సీఎం బృందం వెళ్లనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సదస్సులో పాల్గొననుంది. ఈ పర్యటనలో తెలంగాణ భవిష్యత్ పారిశ్రామిక దిశను నిర్దేశించే కీలక అజెండాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.
ఈసారి దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘‘‘నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30’’ను ఆవిష్కరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఈ కొత్త విధానాన్ని ప్రకటించనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.
2030 నాటికి ప్రపంచంలోని టాప్-3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణను నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. ఫార్మా, బయోటెక్, మెడికల్ డివైసెస్, రీసెర్చ్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇందులో పొందుపరిచారు. ఫార్మా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రీన్ ఫార్మా సిటీ రోడ్ మ్యాప్‌ను కూడా ఈ పాలసీ ద్వారా స్పష్టంగా ప్రకటించనున్నారు.
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా, అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో గ్రీన్ ఫార్మా సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంతో కాలుష్య రహితంగా, నివాసం–ఉద్యోగం–విద్య–వినోదం ఒకే ప్రాంగణంలో ఉండేలా ‘వర్క్, లివ్, లెర్న్ అండ్ ప్లే’ కాన్సెప్ట్‌లో ఈ నగరాన్ని తీర్చిదిద్దనున్నారు.
జనవరి 19 నుంచి 23 వరకు దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటించనుంది. ‘ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్’ అనే థీమ్‌తో జరుగనున్న ఈ సదస్సులో తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా సీఎం సమావేశాలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీల అధినేతలు, గ్లోబల్ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025లో వచ్చిన దాదాపు రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు, అలాగే గత దావోస్ పర్యటనల్లో కుదిరిన ఒప్పందాల పురోగతిపై సీఎం ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించి, పెట్టుబడులు వేగంగా కార్యరూపం దాల్చేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈసారి దావోస్ టూర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమికండక్టర్లు, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఐటీ, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు సాధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, నూతన విధానాలను సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు.
దావోస్ పర్యటన అనంతరం సీఎం అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశముందని సమాచారం. ఆ టూర్ ఖరారైతే ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అమెరికా పర్యటనలో టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, ఇండియన్-అమెరికన్ వ్యాపారవేత్తలతో సీఎం సమావేశాలు జరపనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ విదేశీ పర్యటనలు రాష్ట్రానికి కీలకంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
