AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Government: తెలంగాణ ప్రజలందరికీ శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారికి పండుగే పండగ

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు అందుకు సర్వే చేస్తోంది. ఈ సర్వే ద్వారా లబ్దిదారులను గుర్తించి ప్రభుత్వం సాయం అందించనుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్దిదారుల ఎంపిక జరగనుంది.

Telangana Government: తెలంగాణ ప్రజలందరికీ శుభవార్త..  ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారికి పండుగే పండగ
Telangana Government
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jan 17, 2026 | 2:07 PM

Share

తెలంగాణలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కేరళలో అమలవుతున్న ప్రజా భాగస్వామ్య విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించింది. అత్యంత పేద కుటుంబాలను గుర్తించడం, వారి అవసరాల ఆధారంగా ప్రణాళిక రూపొందించే బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సెర్ప్‌ (రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ)కు అప్పగించారు. ఇప్పటికే సెర్ప్‌, టీజీఐఎల్‌పీ (తెలంగాణ సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమం) కింద ఐదు జిల్లాల్లోని ఎనిమిది మండలాల్లో పైలట్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటున్న సుమారు ఎనిమిది వేల కుటుంబాలను గుర్తించారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో అత్యంత పేద కుటుంబాలను గుర్తించేందుకు నమూనా సర్వే ప్రతిపాదనలను సిద్ధం చేయగా.. వాటికి మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద ఉండగా.. ఆయన ఆమోదం లభించిన వెంటనే సర్వే ప్రారంభం కానుంది.

గ్రామస్తుల భాగస్వామ్యంతో సర్వే

ఈ సర్వే పూర్తిగా గ్రామస్థుల మధ్యనే, గ్రామస్థుల భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు. గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు ఊరిలోని అన్ని వీధుల్లో కాలినడకన తిరిగి ప్రతి ఇంటి పరిస్థితిని పరిశీలిస్తారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ చిత్రపటాన్ని రూపొందించి, అందులో పక్కా ఇళ్లు, కచ్చా ఇళ్లు, గుడిసెలను బొమ్మల రూపంలో చూపిస్తారు. ప్రతి ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలను కార్డులపై రాసి ఆయా ఇళ్ల బొమ్మలపై ఉంచుతారు. ఈ ప్రక్రియ అంతా గ్రామస్తుల సమక్షంలో జరుగుతుంది. ఎలాంటి ఇళ్లలో ఎవరు నివసిస్తున్నారు, వారి జీవన స్థితి ఏంటి అనే విషయాలపై అందరి అభిప్రాయాలు తీసుకుని, సమ్మతితో అత్యంత నిరుపేద కుటుంబాల ప్రాథమిక జాబితాను తయారు చేస్తారు. ఆ జాబితాలో ఉన్న కుటుంబాల వద్దకు నేరుగా వెళ్లి వివరాలు సేకరించి, మహిళా సంఘం సమావేశంలో చర్చించి తుది జాబితాపై తీర్మానం చేస్తారు. గ్రామ పరిధి, జనాభాను బట్టి ఈ కార్యక్రమం మూడు నుంచి ఐదు రోజుల వరకు కొనసాగుతుంది.

లబ్దిదారుల ఎంపిక ఇలా..

గ్రామ స్థాయిలో రూపొందించిన జాబితాను మండల సమాఖ్యకు పంపిస్తారు. మండల సమాఖ్యకు చెందిన నలుగురు ప్రతినిధులు మళ్లీ గ్రామానికి వచ్చి, ఆ జాబితా ఆధారంగా మరోసారి తనిఖీ చేస్తారు. ఆయా కుటుంబాల ఆర్థిక స్థితి, ఆదాయ వనరులు, ఆహార భద్రత, జీవన విధానంపై సమాచారాన్ని సేకరిస్తారు. గ్రామస్తులతో మాట్లాడి నిర్ధారణ చేసుకుంటారు. ఒకవేళ జాబితాలో ఉన్న కుటుంబం వలస వెళ్లి ఉంటే, ఇరుగుపొరుగు వారి ద్వారా వివరాలను ధ్రువీకరిస్తారు. ఈ సమయంలో ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని పరిగణనలోకి తీసుకుని జాబితాను సవరించి తుది రూపం ఇస్తారు. ఆ తర్వాత ఈ తుది జాబితాను ఎంపీడీవోలకు సమర్పిస్తారు. ఎంపీడీవోలు గ్రామ కార్యదర్శి ద్వారా మరోసారి ఫీల్డ్‌ వెరిఫికేషన్ చేయించి, డీఆర్‌డీవో (జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ) అధికారులకు అందజేస్తారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్‌కు జాబితా చేరుతుంది. కలెక్టర్ పరిశీలించి అర్హులను అధికారికంగా ప్రకటించడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.

మార్గదర్శకాలు ఇవే..

అత్యంత పేదలుగా గుర్తించేందుకు పలు ప్రమాణాలను ప్రభుత్వం నిర్దేశించింది. ఎస్సీ, ఎస్టీలు ముఖ్యంగా ఆదిమ తెగలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. సొంత ఇల్లు, సొంత స్థలం లేని వారు, మట్టి గోడలతో ఒక్క గదిలో నివసిస్తున్న కుటుంబాలు, స్థిర ఆదాయం లేక రోజువారీ కూలీపై ఆధారపడేవారు, సాగు భూమి లేని లేదా బీడు భూమి మాత్రమే ఉన్నవారు ఈ జాబితాలోకి వస్తారు. ఒంటరిగా జీవిస్తున్న మహిళలు, ఆసరా లేని వృద్ధులు, పారిశుద్ధ్య పనులు చేసే వారు, చెత్త సేకరించే వారు, ట్రాన్స్‌జెండర్లు, అలాగే టీబీ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు కూడా అర్హులుగా పరిగణిస్తారు. అదేవిధంగా, పని చేయలేని దివ్యాంగులు లేదా 18 ఏళ్లు దాటినా పని చేయలేని పరిస్థితిలో ఉన్న యువత ఉన్న కుటుంబాలు, జీవనోపాధి కోసం తాత్కాలికంగా వలస వెళ్లే కుటుంబాలు, అలాగే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న బీసీ, ఓసీ కుటుంబాలనూ ఈ సర్వేలో లెక్కలోకి తీసుకుంటారు.

వీళ్లు అనర్హులు

అయితే కొన్ని పరిస్థితుల్లో ఉన్నవారు ఈ సాయానికి అనర్హులుగా నిర్ణయించారు. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉంటే, నెలకు రూ.10 వేలకుపైగా ఆదాయం ఉంటే, జీపు, కారు, ట్రాక్టర్ వంటి వాహనాలు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే 2.5 ఎకరాలకుపైగా మాగాణి భూమి, బోర్‌బావి లేదా మోటార్ పంపుసెట్లు ఉన్నవారు, బ్యాంకు లేదా ఇతర సంస్థల నుంచి రూ.50 వేలకుపైగా రుణం తీసుకున్నవారు కూడా అనర్హులుగానే పరిగణిస్తారు.