Telangana: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు కేటాయించిన స్థానాలివే..
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రిజర్వేషన్ల ఖరారుతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం కావడం, ఇప్పుడు మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో అభ్యర్థుల వేట మొదలైంది. అగ్రస్థానాల్లో మహిళా ప్రాతినిధ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన అంకం పూర్తయింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. మొత్తం 10 కార్పొరేషన్లలో 5 మహిళలకు కేటాయించడం ద్వారా మహిళా ప్రాతినిధ్యానికి పెద్దపీట వేశారు. ప్రధాన నగరాల్లో మేయర్ పదవుల రిజర్వేషన్లు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ జనరల్ మహిళకు కేటాయించడం గమనార్హం.
కార్పొరేషన్ రిజర్వేషన్ కేటగిరీ
- జీహెచ్‌ఎంసీ – జనరల్ మహిళ
- వరంగల్ – జరనల్
- నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ – జనరల్ (మహిళ)
- మహబూబ్‌నగర్ – బీసీ మహిళ
- మంచిర్యాల, కరీంనగర్ – బీసీ
- రామగుండం – ఎస్సీ
- కొత్తగూడెం – ఎస్టీ
మున్సిపాలిటీల్లో బీసీల జోరు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ రిజర్వేషనర్లలో బీసీలకు పెకద్దపీట వేశారు. మొత్తం బీసీలకు 38 మున్సిపాలిటీలు కేటాయించారు. ఇందులో బీసీ మహిళలకు 19 కేటాయించింది. బీసీ మహిళలకు రిజర్వ్ అయిన కొన్ని ప్రధాన మున్సిపాలిటీలలో.. ఇల్లందు, జగిత్యాల, కామారెడ్డి, బాన్సువాడ, మెదక్, ములుగు, దేవరకొండ, గజ్వేల్, దుబ్బాక, పరిగి, నర్సంపేట, కాగజ్ నగర్, దేవరకద్ర, చెన్నూరు, కొల్లాపూర్, అచ్చంపేట, ఆలేరు, ఆత్మకూరు, కొత్తకోట ఉన్నాయి. జనగాం, భూపాలపల్లి, నాగర్ కర్నూలు, తాండూరు, హుజూర్ నగర్, సిద్దిపేట సహా మరికొన్ని మున్సిపాలిటీలు బీసీ జనరల్ ఉన్నాయి.
రాజకీయ సమీకరణాలు మార్చనున్న రిజర్వేషన్లు
ఈ రిజర్వేషన్ల ప్రకటనతో ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. 50 శాతం రిజర్వేషన్ల అమలుతో మున్సిపల్ పీఠాలపై మహిళల ఆధిపత్యం పెరగనుంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన చోట అభ్యర్థులు ఇప్పటికే ప్రచారానికి సిద్ధమవుతుండగా, అనుకూలించని చోట తమ అనుచరులను లేదా కుటుంబ సభ్యులను రంగంలోకి దించేందుకు నేతలు ప్లాన్ చేస్తున్నారు.
బీసీ ఓటు బ్యాంక్
బీసీలకు గణనీయమైన సంఖ్యలో మున్సిపాలిటీలు కేటాయించడం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుంది. ఓటర్ల జాబితా కూడా సిద్ధం కావడంతో ఒకటి, రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో తెలంగాణ పురవీధులన్నీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
