AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Council: తెలంగాణ శాసనమండలి రద్దు అవుతుందా..? మాజీ ఎంపీ కామెంట్స్‌ వెనుక ఉన్న మర్మమేంటీ..?

తెలంగాణ శాసన మండలి ఉనికే ప్రమాదంలో పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. రాజ్యాంగం 171 సెక్షన్ ప్రకారం ఎవరైనా కోర్టుకు వెళితే వెంటనే కౌన్సిల్ రద్దయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇంతకీ సడన్ గా తెలంగాణ శాసన మండలికి వచ్చిన ప్రమాదం ఏంటి..?

TG Council: తెలంగాణ శాసనమండలి రద్దు అవుతుందా..? మాజీ ఎంపీ కామెంట్స్‌ వెనుక ఉన్న మర్మమేంటీ..?
Telangana Legislative Council
Balaraju Goud
|

Updated on: Jul 05, 2024 | 5:36 PM

Share

తెలంగాణ శాసన మండలి ఉనికే ప్రమాదంలో పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. రాజ్యాంగం 171 సెక్షన్ ప్రకారం ఎవరైనా కోర్టుకు వెళితే వెంటనే కౌన్సిల్ రద్దయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇంతకీ సడన్ గా తెలంగాణ శాసన మండలికి వచ్చిన ప్రమాదం ఏంటి..? ముందుగా రాజ్యాంగం శాసనమండలి ఏర్పాటు గురించి ఏం చెప్పిందో చూద్దాం…

ఆయా రాష్ట్రాలు ఎగువ సభగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఆర్టికల్ 169, 170, 171, 172 లో ఉన్న నిబంధనలను పాటించాలి. ఆర్టికల్ 171 ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా శాసనమండలి ఏర్పాటు చేయాలనుకుంటే అక్కడున్న శాసన సభ్యుల సంఖ్యలో 1/3 వంతుల సంఖ్యతో కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవాలి. అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 172 లో ఇదే కౌన్సిల్ ఏర్పాటు కోసం మరో నిబంధన పొందుపరిచారు. ఎమ్మెల్యేల సంఖ్యలో 1/3 విభజించిన ఎమ్మెల్సీల సంఖ్య 40 కి తగ్గకూడదు. అంటే ఏ రాష్ట్రంలోనైనా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా 40 మంది ఎమ్మెల్సీలు ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకోసం కచ్చితంగా 120 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ రాష్ట్రంలో కౌన్సిల్ ఉండే అవకాశం ఉంది. ఇందువల్లనే గోవా, జార్ఖండ్ లాంటి చిన్న రాష్ట్రాలలో శాసనమండలి లేదు.

ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ శాసన సభ్యుల సంఖ్య 119. కానీ అప్పటికి ఉన్న చట్ట ప్రకారం ఒక నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే కలుపుకుంటే 120 కి చేరింది. దీంతో 40 మందితో శాసనమండలి ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత 2018లో కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ శాసనసభ్యుల విధానాన్ని రద్దు చేసింది. దీంతో మొన్నటి అసెంబ్లీ 119 మంది సభ్యులతోనే మొదలైంది. ఇలా 119 లో 1/3 చేస్తే 39 మంది శాసనమండలి సభ్యులు మాత్రమే వస్తారు. కనీసం 40 మంది ఉంటేనే శాసనమండలి ఉండాలని చట్టానికి ఇది విరుద్ధంగా ఉంటుందనేది మాజీ ఎంపీ వినోద్ వాదన..

ఇప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్తే శాసనమండలి రద్దడం ఖాయమని అందుకే ఆయన చెప్తున్నారు. తెలంగాణ శాసనమండలి మనుగడ ప్రమాదంలో పడింది అంటున్నారు BRS నేత, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌. తెలంగాణలో శాసనమండలి కొనసాగాలంటే.. అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలంటున్నారు. లోక్ సభలో, శాసనసభలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సభ్యులను మోదీ ప్రభుత్వం తొలగించడంతో రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య 119కి తగ్గిందన్నారు వినోద్‌. ప్రస్తుతం రాష్ట్రంలో మండలి రాజ్యాంగం ప్రకారం లేదని, ఎవరైనా కేసు వేస్తే మండలి రద్దు అవుతుందన్నారు. తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టాలని వినోద్ సూచిస్తున్నారు.

తెలంగాణ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వంతో చర్చించి.. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగేలా చేస్తుందా..? లేక మండలి రద్దవుతుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వినోద్‌ కామెంట్స్‌ వెనుక ఉన్న మర్మమేంటీ..? ఇప్పుడే రద్దు అంశం ఎందుకన్న దానిపైనా తెగ చర్చ నడుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..