CM Revanth Reddy: బందర్ టూ హైదరాబాద్ – సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్
సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్‌లో జరగడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తవుతుండగా, రాష్ట్ర అభివృద్ధి కోసం “తెలంగాణ రైజింగ్” అనే ఒక కలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...
డ్రై పోర్ట్ ఏర్పాటు
తెలంగాణకు తీరప్రాంతం లేకపోవడంతో డ్రై పోర్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని బందర్ ఓడరేవు ద్వారా ప్రత్యేక రహదారి, రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఫోర్త్ సిటీ – ఫ్యూచర్ సిటీ
హైదరాబాద్‌ను “ఫోర్త్ సిటీ”గా, “ఫ్యూచర్ సిటీ”గా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం వివరించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ నగరాలతో పోటీ పడగల నగరంగా దీన్ని అభివృద్ధి చేయాలని ఆయన చెప్పారు. ఫ్యూచర్ సిటీ పూర్తిగా సేవా రంగంతో కూడిన, కాలుష్య రహిత “నెట్ జీరో సిటీ”గా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు.
వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా చర్యలు
తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దేశంలోనే ముందున్నదని సీఎం రేవంత్ తెలిపారు. ఇప్పటికే 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీకి ప్రవేశపెడుతున్నామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను పూర్తిగా తొలగించడం వలన ఈ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మూసీ పునరుజ్జీవన ప్రణాళిక
మూసీ నదిని పునరుజ్జీవింపజేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం చెప్పారు. ఈ నది 55 కిలోమీటర్ల మేర మంచినీటితో ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నారు. 2050 వరకు తాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
రీజినల్ రింగ్ రోడ్ & రైల్వే
360 కిలోమీటర్ల పొడవు కలిగిన రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణంలో ఉందని సీఎం వివరించారు. ORR, RRRలను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మిస్తామని తెలిపారు. అలాగే, ఈ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాన్ని తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు.
పరిశ్రమల అభివృద్ధి
ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందని సీఎం తెలిపారు. స్కిల్స్ అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టి, తెలంగాణను చైనాకు ప్లస్ సిటీగా మారుస్తామని చెప్పారు.
గ్రామీణ తెలంగాణ అభివృద్ధి
అవుటర్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న గ్రామీణ తెలంగాణ ప్రాంతాల్లో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు.
పెట్టుబడిదారులకు ఆహ్వానం
“తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మాతో కలిసి రండి. ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యాపార సౌలభ్యాన్ని అందిస్తాం. రండి… కలిసి అద్భుతాలు సృష్టిద్దాం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..