Telangana: మృత్యువులోనూ వీడని బంధం… భర్త మృతిని తట్టుకోలేక భార్యకు గుండెపోటు..
వివాహ బంధం.. అంటే ఏడడుగుల జన్మల బంధం అంటారు. కష్ట సుఖాల్లో కలకాలం తోడుగా కలిసుంటామని పెళ్లినాడు ప్రమాణాలు చేసుకున్నారు. ఒకరి కోసం ఒకరిగా బతికారు. అన్యోన్య దాంపత్యానికి, అమలిన ప్రేమకు సాక్షులుగా నిలిచిన ఈ దంపతులు మృత్యువులోనూ తమ బంధాన్ని వీడలేదు. భర్త గుండెపోటుతో మృతి చెందగా, ఆ బాధను తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు విడిచింది.

నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెలకు చెందిన దుబ్బ శంకరయ్య(67)కు లక్ష్మి(55)తో 30 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం లేకపోవడంతో ఓ అబ్బాయిని దత్తత తీసుకున్నారు. జీవనోపాధి కోసం 15 ఏళ్ల క్రితం శంకరయ్య కుటుంబంతో హైదరాబాద్‌కు వలస వెళ్లారు. శంకరయ్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వాచ్‌మెన్‌గా, లక్ష్మి వస్త్ర దుకాణంలో పని చేస్తూ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. కొన్ని నెలలుగా శంకరయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శంకరయ్య గుండెపోటుతో మృతి చెందారు. మృతదేహాన్ని సొంతూరు పలివెలకు తీసుకొచ్చారు. భర్త మరణాన్ని తట్టుకోలేక లక్ష్మి తీవ్రంగా రోదించారు. ఎందరు ఓదార్చినా ఊరడిల్లలేదు. భర్త మృతిని తట్టుకోలేక భర్త మృతదేహం పక్కనే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒకరోజు వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందడం, ఇద్దరినీ ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించడం చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు.
ఖమ్మం జిల్లాలోనూ ఇలాంటి విషాదం
సేమ్ ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాధాటి హనుమ రెడ్డి ( 81), బాధాటి యశోద (76) జీవనం సాగిస్తున్నారు. యశోద కింద పడి.. తలకి బలమైన గాయం కావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. భార్య మరణ వార్త విని హనుమ రెడ్డి గుండె పోటుతో మృతి చెందారు. ఒక గంట వ్యవధిలోనే వృద్ధ దంపతులు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Hanuma Reddy -Yashoda
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..