Chanchalguda Jail: చంచల్‌గూడ జైల్లో ఇన్‌స్టా రీల్స్.. కటకటాల వెనక తెగ ఎంజాయ్ చేస్తున్న ఖైదీలు! వీడియో వైరల్
హైదరాబాద్ పాత బస్తీలోని చంచల్‌గూడ జైలులోని ఓ రిమాండ్ ఖైదీ రీల్స్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. చంచల్‌గూడ జైలులో 'ములాఖత్ (సమావేశం)' సమయంలో రిమాండ్ ఖైదీని కలిసేందుకు వచ్చిన ఆకతాయిలు వీడియో రికార్డు చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హాట్ టాపిక్ గా మారింది..

హైదరాబాద్, ఏప్రిల్ 15: పాతబస్తీకి చెందిన అహ్మద్ జబ్రీ ఏప్రిల్ 11న దారి దోపిడీ కేసులో అరెస్టు కావడంతో.. చంచల్‌గూడ జైలుకు రిమాండ్ ఖైదీగా పంపారు. మరుసటి రోజు అతడిని కలిసేందుకు కొందరు స్నేహితులు జైల్‌కు వచ్చారు. అక్కడ ములాఖత్ సమయంలో జబ్రీతో కలిసి రీల్స్ చేశారు. జబ్రీ ల్యాండ్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు, విచిత్ర భంగిమలతో చేతులూపడం, హావాభావాలతో జైలులో ఎంజాయ్ చేస్తున్నట్లు.. వీడియో షూట్ చేశారు. ఇక ఈ వీడియోను ఏప్రిల్ 13న అహ్మద్ జబ్రీ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో చంచల్‌గూడ జైలు అంటూ పోస్టు చేశారు. ఇక ఈ వీడియో జైలు అధికారులతోపాటు అందరికీ చేరడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. దీంతో రీల్ షూట్ చేసి అప్‌లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించి చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు.
సాధారణంగా ఆదివారాలు తప్ప ఖైదీలను. విచారణలో ఉన్న ఖైదీలను కలవడానికి నిత్యం వందలాది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు చంచల్‌గూడ జైలుకు వస్తుంటారు. అయితే చుట్టూ ఎందరో పోలీసులు, సీసీ కెమెరా నిఘాలో ఉండే జైల్లోనే ఏకంగా ఖైదీతో రీల్స్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పోలీసుల నిఘా లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరాలు చేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు.. చంచల్‌గూడ జైలు టూర్ స్పాట్ మాదిరి ఉందని, నేరస్థులు కటకటాల వెనుక కూడా ఎంజయ్ చేస్తున్నట్లు కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జైలులో రీల్స్ తీసిన అంశంపై చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్ స్పందిస్తూ.. ములాఖత్‌కు వచ్చిన వారు దుస్తుల్లో మొబైల్ దాచుకుని వచ్చారని, రీల్స్ చేసిన సమయంలో గార్డ్ డ్యూటీలో ఎవరెవరు ఉన్నారో తనిఖీ చేస్తున్నామన్నారు. వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, జైలులో ములాఖత్‌కు వచ్చే వారి విషయంలో ఇకపై జాగ్రత్తలు పాటిస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
View this post on Instagram
కాగా జూలై 2024లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బండ్లగూడ పోలీసులు పోలీస్ స్టేషన్ లోపల ఇన్‌స్టాగ్రామ్ రీల్ రికార్డ్ చేసినందుకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. దస్తగిర్ అనే వ్యక్తి అమ్మాయిని కిడ్నాప్ చేసినందుకు అరెస్టు బండ్లగూడ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఉంచారు. అయితే నిందితుడిని కలిసేందుకు వచ్చిన ఇద్దరు స్నేహితులు నేరస్థుడితో కలిసి రీల్స్ చేశారు. దీంతో ముగ్గురినీ అదే సెల్‌లో ఉంచారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.