Hyderabad news: వేసవిలో నీటి ఇబ్బందులు ఉండొద్దు.. అధికారులకు జలమండలి ఎండీ ఆదేశం
హైదరాబాద్(Hyderabad) నగరంలో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఎండీ దాన కిశోర్ ఆదేశించారు. వేసవికాలం (Summer), రంజాన్ మాసం నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరా, సీవరేజి నిర్వహణపై...
హైదరాబాద్(Hyderabad) నగరంలో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఎండీ దాన కిశోర్ ఆదేశించారు. వేసవికాలం (Summer), రంజాన్ మాసం నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరా, సీవరేజి నిర్వహణపై బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎక్కడ నీటికి ఇబ్బంది ఉన్నా వెంటనే ట్యాంకర్ ద్వారా సరఫరా (Water Distribution) చేయాలని సూచించారు. ఇందుకోసం అవసరమైతే అదనపు ట్యాంకర్లను కూడా సిద్ధంగా ఉంచాలని, అదనపు ఫిల్లింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బుధవారం నాటికి 98 శాతం ట్యాంకర్ బుకింగ్‌లను ఎప్పటికప్పుడు డెలివరీ చేస్తున్నామని, ఇదే విధంగా ట్యాంకర్ల సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని పేర్కొన్నారు. సింగూరు, మంజీరా ట్రాన్స్‌మిషన్ లైన్లు ఎక్కడైనా పాడైతే వెంటనే ఆధునికీకరణ పనులు చేపట్టాలని, పనులు జరుగుతున్నప్పుడు నీటి సరఫరాలో ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎక్కడైనా పనులు జరిపేందుకు షట్‌డౌన్ తీసుకున్నప్పుడు ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. ఎక్కడా కలుషిత నీరు సరఫరా కాకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని, నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
రంజాన్ మాసం దృష్ట్యా అవసరమైన చోట్ల మసీదులకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులకు దాన కిశోర్ సూచించారు. ఎక్కడా సీవరేజి ఓవర్‌ఫ్లో వంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. తరచూ సీవరేజి ఓవర్‌ఫ్లో అయ్యే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వెంటనే సమస్యలు పరిష్కరించడానికి జెట్టింగ్ మిషన్‌లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. సీవరేజి పనులు జరిగినప్పుడు వెలికితీసే సీల్డ్‌ను ఎప్పటికప్పుడు ఎత్తేసి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రజలు ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజక మాధ్యమాల ద్వారా తాగునీరు, సీవరేజి సమస్యలపై చేసే ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు గానూ చురుగ్గా ఉండాలని సూచించారు.
నగరంలో జలమండలి చేపట్టే మరమ్మతులు, కొత్త నిర్మాణ పనులకు పైపులు, మ్యాన్‌హోల్ కవర్లు, వాల్వులు, తదితర సామాగ్రి తరలింపులో జాప్యం లేకుండా చూడాలి. ఇందుకోసం సెంట్రల్ స్టోర్‌ను వికేంద్రీకరించాలి. ఇప్పటివరకు ఖైరతాబాద్‌లో సెంట్రల్ స్టోర్ డివిజన్, హైదర్‌నగర్, గోషామహాల్‌లో సబ్ డివిజన్లు ఉన్నాయి. ఇక్కడి నుంచే నగరం మొత్తం అవసరమైన సామాగ్రిని తరలిస్తున్నారు. ఇప్పుడు నగరంలో సైనిక్‌పురి, సాహేబ్‌నగర్ ప్రాంతాల్లో మరో స్టోర్‌లను ఏర్పాటు చేయాలి. తద్వారా సామాగ్రి తరలింపును సులభతరం చేయాలి. కొత్తగా స్టోర్లు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు ఫెన్సింగ్ వంటి రక్షణ చర్యలు తీసుకోవాలి.
– దాన కిశోర్, జలమండలి ఎండి
ఇవీచదవండి.
Viral Video: ఈ పిల్లికి అతీంద్ర శక్తులేమైనా ఉన్నాయా ఏంటి.. వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!
Kurnool: ఏపీలోని ఆ జిల్లాలో కరోనా ఖేల్ ఖతం.. సున్నాకు చేరుకున్న యాక్టివ్ కేసులు..
Agriculture News: సేంద్రియ వ్యవసాయానికి ప్రభుత్వ ప్రోత్సాహం.. 50 వేల రూపాయల ఆర్థిక సాయం..!