AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరంగల్ అర్బన్ జిల్లాలో విషాదం.. కోతుల దాడిని తప్పించుకోబోయిన ఎంసీఏ విద్యార్థిని.. భవనంపై నుంచి పడి దుర్మరణం

కోతుల గుంపు ఒక్కసారిగా హాస్టల్ భవనంలోకి ప్రవేశించడంతో హాస్టల్ బిల్డింగ్ పైనుంచి జారిపడి ఓ ఎంసీఏ విద్యార్థిని ప్రాణాలను కోల్పోయింది.

వరంగల్ అర్బన్ జిల్లాలో విషాదం.. కోతుల దాడిని తప్పించుకోబోయిన ఎంసీఏ విద్యార్థిని.. భవనంపై నుంచి పడి దుర్మరణం
Balaraju Goud
|

Updated on: Mar 11, 2021 | 10:30 AM

Share

MCA Student dies : వానరసేనల ఆకలి దాడులు ఓ విద్యార్థిని ప్రాణాలు బలి తీసుకున్నాయి.. కోతుల గుంపు ఒక్కసారిగా హాస్టల్ భవనంలోకి ప్రవేశించడంతో హాస్టల్ బిల్డింగ్ పైనుంచి జారిపడి ఓ ఎంసీఏ విద్యార్థిని ప్రాణాలను కోల్పోయింది. ఆకలి చల్లార్చుకునేందుకు వచ్చి… ఏకంగా ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యాయి. ఈ దురదృష్టకర సంఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజిపేట మండలంలోని బట్టుపల్లిలో చోటుచేసుకుంది.

రేగొండ మండలంలోని నాగుర్లపల్లి గ్రామానికి చెందిన శిరీష బట్టుపల్లిలోని హాస్టల్‌లో ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీన్ దయాల్ ఉపాద్యాయ గ్రామీణ కౌసల్య యోజన కేంద్రంలో ఎంసీఏ చదువుతోంది.అందరూ హాస్టల్ రూమ్‌లో ఉన్నారు. ఒకరితో మరొకరు మాటలు చెప్పుకుంటున్నారు. అంతే ….ఇంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని…ఓ వానర సైన్యం.. విద్యార్థులు ఉన్న గదిలోకి ప్రవేశించింది. కోతులు గుంపులుగా గదిలోకి రావడంతో లోపల ఉన్న వాళ్లంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఇదే సమయంలో కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు ఎంసీఏ విద్యార్థిని శిరీష పరుగులు తీస్తూనే వరండా గోడపై నుంచి జారి భవనం పైనుంచి కిందకు పడింది.

ఇది గమనించి తోటి విద్యార్థులు.. వెంటనే ఆమెను వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికి పరిస్థితి చేజారిపోయింది. శిరీష తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం శిరీష మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

మరోవైపు, కోతుల దాడిలో ప్రమాదవశాత్తు శిరీష చనిపోయిందన్న వార్తను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. శిరీష స్వగ్రామం రేగొండ మండలంలోని నాగుర్లపల్లి గ్రామంలో కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండిః

మమతా బెనర్జీపై దాడి, ఖండనలు, సానుభూతి కోసమే ‘డ్రామా’ అంటూ సెటైరికల్ ట్వీట్లు 

Mahashivratri Special-2021: శివరాత్రి వచ్చిందంటే చాలు.. అందరు కందగడ్డ వైపే చూస్తారు.. అసలు శివుడికి – కందగడ్డకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?