Bal Puraskar: ఓరుగల్లు బాలికకు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా..

గత ఏడేళ్లుగా కూచిపూడి గురువురు సుధీర్ రావు వద్ద నాట్యం నేర్చుకుంటున్న లక్ష్మీప్రియ ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. కూచిపూడితో పాటు మోహినీ అట్టంలోనూ ప్రతిభను కనబరుస్తున్న లక్ష్మీప్రియ 2020లో ఆర్ట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుని, మోహిన నాట్యంలో...

Bal Puraskar: ఓరుగల్లు బాలికకు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా..
Pendyala Laxmipriya
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Narender Vaitla

Updated on: Jan 25, 2024 | 6:32 PM

కళలకు కాణాచిగా పేరుగాంచిన కాకతీయుల రాజధాని నగరం వరంగల్ నుంచి ఓ బాలిక యావద్దేశం దృష్టిని ఆకట్టుకుంటోంది. సొగసైన కూచిపూడి నృత్యంతో గత ఏడాది జాతీయస్థాయిలో జరిగిన ‘కళా ఉత్సవ్’ అన్ని రకాల శాస్త్రీయ నృత్యాల్లో కూచిపూడి ప్రదర్శనతో మొదటిస్థానం సొంతం చేసుకుంది. ఇప్పుడు సాహస బాలలతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన బాలలకు ఇచ్చే ‘జాతీయ బాల పురస్కార్’ అవార్డుల్లో ఎంపికై జనవరి 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకుంది. ఆ బాలిక పెండ్యాల లక్ష్మీప్రియ. హన్మకొండకు చెందిన పెండ్యాల రాకేశ్ కుమార్, సాయిలతల కుమార్తె లక్ష్మీప్రియ కాజీపేటలోని మాంట్‌ఫోర్డ్ స్కూల్‌లో 10వ తరగతి చదువుకుంటోంది.

గత ఏడేళ్లుగా కూచిపూడి గురువురు సుధీర్ రావు వద్ద నాట్యం నేర్చుకుంటున్న లక్ష్మీప్రియ ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. కూచిపూడితో పాటు మోహినీ అట్టంలోనూ ప్రతిభను కనబరుస్తున్న లక్ష్మీప్రియ 2020లో ఆర్ట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుని, మోహిన నాట్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ‘లాస్యప్రియ’ బిరుదు అందుకుంది. గత ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొని, ప్రధానితో మాట్లాడింది. అంతే కాదు, ఆయన ముందు ఓ 2 నిమిషాల నృత్య ప్రదర్శన చేసి ఆకట్టుకుంది.

జనవరి 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మర్నాడు ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్‌లో పాల్గొంది. అనంతరం పురస్కార విజేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాటామంతీ నిర్వహించగా.. ఆయన లక్ష్మీప్రియను మెచ్చుకున్నారు. ఓ సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన లక్ష్మీప్రియ శాస్త్రీయ నృత్యంలో ప్రదర్శిస్తున్న ప్రతిభను చూసి పాఠశాల యాజమాన్యం ఉచితంగా విద్యను అందజేస్తోంది. తల్లి, అమ్మమ్మకు శాస్త్రీయ నృత్యంపై అమితమైన ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా అందులోకి అడుగుపెట్టలేకపోయారని లక్ష్మీప్రియ చెబుతోంది. తాను నృత్యకారిణిగా మారి వారి కోరికను తీర్చానని, చిన్నతనం నుంచి కూచిపూడికి ఆకర్షితురాలనయ్యాను అని చెబుతోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే పరేడ్‌లో ఇతర విభాగాల్లో బాల పురస్కార్ అందుకున్న విజేతలతో కలిసి పాల్గొననుంది.

వేదిక కావాలి..

ఏ కళాకారుడికైనా తమ కళను, ప్రతిభను ప్రదర్శించడానికి వేదిక కావాలని.. అప్పుడే వారి కళానైపుణ్యం గురించి ప్రపంచానికి తెలుస్తుందని లక్ష్మీప్రియ చెబుతోంది. ప్రస్తుతం పాఠశాల విద్యను పూర్తిచేసుకుంటున్న దశలో ఉన్న తనకు కూడా ఒక వేదికను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తే.. తాను రాష్ట్రానికి పేరు తెచ్చేలా ప్రతిభను ప్రదర్శిస్తానని అంటోంది. తల్లిదండ్రులు, గురువుతో పాటు తాను చదువుకుంటున్న పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహం వల్లనే బాల పురస్కార్ వరకు చేరుకోగలిగానని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే ఇలాంటి కళలను భావితరాలకు అందిస్తూ హైందవ సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చని చెబుతోంది. ‘కళా ఉత్సవ్’లో దేశవ్యాప్తంగా అనేక మంది శాస్త్రీయ నృత్యంలోని భరతనాట్యం, కథక్ సహా అనేక నృత్యరూపకాలను ప్రదర్శించగా, తాను ప్రదర్శించిన కూచిపూడి ప్రదర్శన మొదటి స్థానం కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని చెబుతోంది.

ఆర్థిక చేయూత అవసరం: సుధీర్ రావు

గతంలో కళాకారులు కేవలం కళను మాత్రమే నమ్ముకుని గురువులకు సేవ చేస్తూ నేర్చుకున్నామని, కానీ ఈ పోటీ యుగంలో కళాకారులు విద్యాభ్యాసాన్ని కూడా సమాంతరంగా కొనసాగించక తప్పని పరిస్థితి ఉందని లక్ష్మీప్రియ నాట్యగురువు సుధీర్ రావు అన్నారు. కళా ప్రదర్శన ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ధనిక కుటుంబాల నుంచి వచ్చినవారికి ఇబ్బంది లేకపోయినా పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారికి మాత్రం కళల్లో కొనసాగాలంటే ఆర్థికంగా చేయూత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుంచి ప్రోత్సాహం ఉందని, అయితే ఆర్థిక చేయూత కూడా అందిస్తే ఇలాంటి కళాకారులను మరింతమందిని తయారు చేయడానికి వీలుంటుందని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..