MP Avinash Reddy: వివేకా హత్య కేసులో కొత్త వాదనలు.. సరికొత్త అంశాలు.. ఆరెస్టు వద్దంటూ ముందస్తు బెయిల్..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త వాదనలు.. సరికొత్త అంశాలు తెరమీదకు వస్తున్నాయి. కీలక దశకు చేరిన ఈ కేసులో ఇప్పటికే భాస్కర్ రెడ్డి అరెస్టు కాగా.. 25 వరకూ అవినాష్ రెడ్డికి ఆరెస్టు వద్దంటూ ముందస్తు బెయిలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. మొత్తానికి ఆస్తులు- అప్పులు, సెంటిమెంట్లు-సెటిల్మెంట్లు, వివాహేతర సంబంధాలు- రాజకీయాలంటూ అనేక మలుపులు తిరుగుతోంది. అవినాష్ రెడ్డి ఫ్యామిలీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో.. వివేకా కుమార్తె సునీతారెడ్డి కుటుంబంపైనా అదే స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు రాజకీయంగానూ ఈ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది.
YS వివేకానందరెడ్డి హత్య జరిగి నాలుగేళ్లు గడిచిపోయింది. ఈ మధ్యలో లెక్కలేనన్ని ట్విస్టులు చోటుచేసుకున్నాయి. సుప్రీం జోక్యంతో విచారణను మరింత వేగవంతం చేసింది CBI. ఇన్వెస్టిగేషన్ తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు తారస్థాయికి చేరుకున్నాయి. వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్టు తర్వాత అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. నిన్న, ఇవాళ సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. హత్య జరిగిన రోజు ఘటనలు.. తర్వాత జరిగిన పరిణామాలపై వాడీవేడిగా వాదనలు వినిపించారు న్యాయవాదులు. వివేకా చనిపోయారని అవినాష్‌కు చెప్పింది సునీత భర్త సోదరుడు శివప్రకాశ్ రెడ్డి అని అవినాష్ తరపు న్యాయవాది వాదించారు. అనేక ఆధారాలు కళ్లముందున్నా వాటిని పక్కనపెట్టి తనను టార్గెట్ చేసి విచారణ జరుగుతుందని అవినాష్ ఆరోపిస్తున్నారు.
అయితే శాస్త్రీయంగా, సాంకేతికంగా అన్ని ఆధారాలు సేకరించామని సుప్రీంకోర్టు కూడా ఈ నెల30లోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ వద్దని సీబీఐ వాదించింది. ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించడంతో ఊరట లభించినట్టు అయింది. అటు ఇప్పటికే అరెస్టు అయిన ఉదయ్‌కుమార్, వైఎస్ భాస్కర్‌రెడ్డిలను కస్టడీకి అనుమతించింది CBI న్యాయస్థానం.
లీగల్ ఫైట్ అటు నడుస్తుండగానే మరోవైపు ఈ వ్యవహారం రాజకీయంగాపై దుమారం రేపుతోంది. కేసు నుంచి బయటపడేందుకు లాబీయిస్టులను వాడుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తుంటే.. స్వామీజీలకు, లాబీయిస్టులకు తేడా తెలియకపోవడం విపక్షాల విజ్ఞతకే వదిలేస్తామంటోంది వైసీపీ.
మరోవైపు ఈ కేసులో భాస్కర్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవధర్. మొత్తానికి ఈ వ్యవహారం అటు చట్టపరంగా.. ఇటు రాజకీయంగా సంచలనాలకు కేంద్రబిందువైంది. మరి ఈ నెల 30తో ఇందులో ఉన్న చిక్కులన్నీ వీడి స్పష్టత వస్తుందా?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం