Uppaka: పాడు బడ్డ బావి నుంచి అదే పనిగా చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా
పాము ప్రాణాలు నిలబెట్టేందుకు.. తన ప్రాణాలు సైతం లెక్క చేయలేదు ఓ స్నేక్ క్యాచర్. పాడుబడ్డ బావిలో ఐదు రోజులుగా త్రాచు పాము పైకి రాలేక ఆకలి, దప్పికతో రోజుల తరబడి మృత్యువుతో పోరాడుతుంది. గమనించిన స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. స్పాట్‌కి చేరుకుని రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ భార్గవ్ ప్రాణాలకు తెగించి మరీ దాన్ని కాపాడాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో ఐదు రోజుల క్రితం ఓ పాము ఉండటాన్ని గుర్తించారు స్థానికులు. ఐదు రోజుల నుంచి అది పైకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంది కానీ సాధ్యపడటం లేదు. నీరసించి… బావిలోనే తచ్చాడుతుడున్న పాము గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. వారు పాములను రెస్క్యూ చేసే స్నేక్ క్యాచర్ భార్గవ్‌కు సమాచారం అందించారు.
పామును కాపాడేందుకు వచ్చిన స్నేక్ క్యాచర్ భార్గవ్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బావిలో దిగి రెస్క్యూ చేసి దాన్ని కాపాడారు. ఏమాత్రం పొరపాటు జరిగిన తన ప్రాణానికి ముప్పని తెలిసినా… పాము కోసం భార్గవ్ రెస్క్యూ చేయడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. పాడుపడిన బావిలో నుండి పాములు తీసిన భార్గవ్ దానిని సురక్షితంగా అడవిలో వదిలేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనావాసాల్లోకి పాములు రావడం సహజం అని.. వాటికి హాని తలపెట్టకుండా.. కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పాడు. ఎండల తీవ్రత నేపథ్యంలో.. పాముల మరుగు ప్రాంతాలను వెతుక్కుంటూ వస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భార్గవ్ సూచించాడు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
