Nizamabad: మాత్ర వేస్తేనే మూత్రం ఆగేది.. అరుదైన వ్యాధితో బాలుడి నరకయాతన.. సాయం కోసం ఎదురుచూపు

Boy suffering with urine disease: అదో చెప్పుకోలేని బాధ.. అలాగని భరించలేని వ్యధ.. ఇదీ ఓ బాలుడి దీనగాథ.. బాల్యాన్ని ఎంతో అల్లారుముద్దుగా.. ఆనందంగా గడపాల్సిన వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలుడికి విధి చూపిస్తున్న నరకం..

Nizamabad: మాత్ర వేస్తేనే మూత్రం ఆగేది.. అరుదైన వ్యాధితో బాలుడి నరకయాతన.. సాయం కోసం ఎదురుచూపు
Health

Boy suffering with urine disease: అదో చెప్పుకోలేని బాధ.. అలాగని భరించలేని వ్యధ.. ఇదీ ఓ బాలుడి దీనగాథ.. బాల్యాన్ని ఎంతో అల్లారుముద్దుగా.. ఆనందంగా గడపాల్సిన వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలుడికి విధి చూపిస్తున్న నరకం.. అంతాఇంతా కాదు. ప‌కృతిలో కాలకృత్యాలు ప్రతిజీవికి సహాజం.. కాని ప్రకృతికి విరుద్దంగా అసహాజంగా జరిగితే ఎలా ఉంటుంది.. ఊహించడానికే భయంగా ఉంది కదా.. అచ్చం ఇలానే బాధపడుతున్నాడు.. నిజామాబాద్ జిల్లాలోని ఓ బాలుడు. మూత్రం ఆగాలంటే మాత్ర కావాలి.. ఆ మాత్ర కావాలంటే డబ్బు కావాలి.. ఆ డబ్బు సమయానికి అందకపోతే.. ఎప్పుడేమవుతుందోనని తెలియని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన బాలుడు. ఇదీ తల్లీతండ్రి లేని పదో తరగతి విద్యార్థి గుండేటి దీపక్ దయనీయ పరిస్థితి. లక్షల్లో ఒక్కరికో.. ఇద్దరికో సోకే ఈ అరుదైన జబ్బుతో ఆ బాలుడు నరకయాతన అనుభవిస్తూ… చికిత్స చేయించుకోలేక నిస్సహాయ స్థితిలో చేయూత కోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు.. వయసుమళ్ళిన వారు బీపీ టాబ్లెట్ వేసుకున్నట్టే.. ఈ బాలుడు కూడా చిన్న వయసులోనే మాత్ర వేసికోవాల్సిందే.. కష్టాలున్న వారినే గిల్లి మరీ బాధపెడుతుంది విధి అంటారు. అలానే ఈ బాలుడి జీవితం కూడా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. లక్షల్లో ముగ్గురికి మాత్రమే వచ్చే వ్యాధి ఆ బాలునికి రావటం.. తన తండ్రి గుండె పోటుతో మరణించటం.. ఆ తర్వాత తల్లి అనారోగ్యంతో అనంతలోకాలకు వెళ్లటం.. ఇలా ప్రతి విషయం బాలుడిని మానసికంగా ఇబ్బంది పెడుతూనే ఉంది.. ప్రస్తుతం జీవితం చరమాంకంలో ఉన్న ఈ బాలుడికి.. ఎలాంటి సాయం చేయలేని నానమ్మే దిక్కుగా ఉంది.

తల్లితండ్రుల మ‌ర‌ణంతో అనాధలుగా ఆ ఇద్దరు పిల్లలు.. బోధన్ పోస్టాఫీస్ సమీపంలో నివసించే అబ్బవ్వకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు.. రవి, లలిత దంపతులకు కుమారుడు దీపక్, కూతురు శ్రావ్య ఉన్నారు. శ్రావ్య గురుకులంలో 9వ తరగతి చదువుతోంది. భోదన్లోని సామిల్‌లో రవి పని చేయగా.. లలిత ఇంట్లోనే బీడీలు చుడుతూ కుటుంబాన్ని నెట్టకొచ్చేవారు. ఉన్నదాంట్లో హాయిగా జీవనం సాగిస్తున్న వాళ్ల జీవితాలను విధి ఓ కుదుపు కుదిపింది. 2019లో గుండెపోటుతో రవి చనిపోగా… ఇంటి భాద్యతలు భార్య లలితపై పడ్డాయి. ఉపాధి కోసం గడప దాటింది. దుకాణాల్లో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోసింది. కొడుకుకు చికిత్స చేయించలేకపోతున్నాననే బాధ.. ఇంటి పరిస్థితి దిగజారిపోతుందనే ఆందోళనలతో ఆకలినే మరిచిపోయింది ఆ తల్లి. క్రమంగా లలిత ఆరోగ్యం క్షీణించి మరణించింది.

పోషిస్తున్న నాయనమ్మ.. 

దీంతో అనాధలైన ఇద్దరు పిల్లల బాధ్యతను నానమ్మ తీసుకుంది. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న దీపక్​ను చిన్నప్పటి నుంచే అనారోగ్యం వెంటాడుతోంది. చివరకు జీవితకాలంపాటు వెంటాడే వ్యాధిగా తేలింది. ఐదేళ్ల ప్రాయంలోనే దీపక్​కు డెంగీ సోకితే హైదరాబాద్​కు తీసుకెళ్లి నయం చేయించుకొచ్చారు. అప్పుడే చాలా డబ్బులు ఖర్చు అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో.. ముక్కులో నుంచి రక్తం కారడం మొదలైంది. ఏమిటా అని ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎన్నో పరీక్షలు చేయించారు. పరీక్షలకు డబ్బులు లేక సతమతమవుతుంటే.. దాతల ఆర్థిక సాయంతో హైదరాబాద్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకున్నారు. మూడేళ్ళ కిందట ఉపాధ్యాయురాలు సుధ కొన్ని పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో బాలుడికి సెంట్రల్ డయాబెటిక్ ఇన్సిపిడస్ (సీడీఐ) అనే అరుదైన వ్యాధి ఉందని గుర్తించారు.

ముత్రపిండాల వ్యాధితో.. 

ఈ వ్యాధిలో మూత్రపిండాలను నియంత్రించే హార్మోన్​ను విడుదల చేసే పిట్యూటరీ గ్రంథి దెబ్బతినడంతో.. తాగిన నీరు శరీరానికి అందకుంగా నేరుగా మూత్రపిండాల ద్వారా బయటకు వెళుతుంది. తరచూ దాహం కావడం, తిన్నది కూడా ఒంటికి పట్టకపోవడం జరుగుతుంది. మూత్రపిండాలను పనిచేయించాలంటే కృత్రిమంగా హార్మోను మాత్రలు వాడాలని వైద్యులు వెల్లడించారు. ఈ లోపాలతో బాలుడిలో ఎదుగుదల నిలిచిపోయింది. ఇంకా చిన్న పిల్లాడి రూపమే కనిపిస్తోంది. మాత్ర వేయకుంటే అతి మూత్రం సమస్య వేధిస్తుంది. దీనిని అరికట్టేందుకు రోజుకు రెండు పూటలు మాత్రలు వేయాల్సిందే. లేదంటే తరచూ మూత్రానికి పోవాల్సి వస్తుందని కుటుంబసభ్యులు తెలిపారు. కేవలం ఒక రోజు రాత్రిలోనే ఐదు లీటర్ల మూత్రం ఉత్పత్తి అయినట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికీ మాత్ర వేసుకోకుంటే రాత్రి పూట ఎక్కువసార్లు నిద్ర లేవాల్సిన పరిస్థితి. తరచూ దాహం, మూత్రంతో శరీరం బలహీనపడడం, రాత్రి మూత్రంతో సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతూ.. దీపక్​ నరకయాతన అనుభవిస్తున్నాడు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఈ మాత్రలే ఇప్పుడు గుదిబండగా మారాయి. మూడేళ్ళ పాటు దుకాణంలో పని చేసి.. వచ్చిన జీతంతో తల్లి మాత్రలు తీసుకొచ్చింది. నానమ్మ, అమ్మ సంపాదనతో సర్దుకుపోయినా.. ఇప్పుడు తల్లి చనిపోవడంతో వృద్ధురాలిపైనే భారమంతా పడుతోంది.

ఆదుకోండి.. ఆమెకొచ్చే అరకొర ఆదాయం కుటుంబ పోషణకే సరిపోవడంలేదని.. ఇక మాత్రలెక్కడి నుంచి తెచ్చి మనవన్ని కాపాడుకోవాలని కన్నీరుమున్నీరవుతోంది దీపక్‌ నానమ్మ. వృద్ధ వయసులో ఉన్న అబ్బవ్వ.. చిన్నారులిద్దరినీ చూసుకునేందుకు చేతనైన కష్టం చేస్తోంది. ఎంత చేసినా.. చిన్నారులిద్దరి పోషణకు కూడా సరిపోవడం లేదని రోదిస్తోంది. చికిత్స చేయించడానికి తన దగ్గర డబ్బుల్లేవని.. ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న దీపక్‌కు దాతలు సాయం చేయాలని వేడుకుంటోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు తలిచి చిన్నారికి వైద్య సాయం అందించాలని అబ్బవ్వ కోరుతోంది.

ప్రభాక‌ర్, టీవీ9 తెలుగు రిపోర్టర్, నిజామాబాద్

Also Read:

Indian Railway: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రైళ్లను అద్దెకు ఇచ్చేందుకు ‘భారత్‌ గౌరవ్‌ స్కీమ్‌’

Narendra Singh Tomar: వాళ్ల మరణాలు రికార్డుల్లో లేవు.. పరిహారం సాధ్యం కాదు: కేంద్రం కీలక ప్రకటన

Click on your DTH Provider to Add TV9 Telugu