Telangana: తెలంగాణలో వైద్య రంగానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద పీట.. 8 ఏళ్లలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు.
తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయటానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గడిచిన 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వైద్య రంగానికి పెద్ద పీట వేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 2014-15 నుంచి..
తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయటానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గడిచిన 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వైద్య రంగానికి పెద్ద పీట వేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 2014-15 నుంచి ఇప్పటి వరకు రూ.5,550 కోట్ల నేషనల్ హెల్త్ మిషన్ నిధులు విడుదల చేసిందన్నారు. తెలంగాణలో వైద్య రంగానికి కేంద్రం చేసిన పనుల గురించి పూర్తి లెక్కలతో సహా కేంద్ర మంత్రి వివరించారు. కిషన్ రెడ్డి తెలిపిన వివరాలు ఇవే..
దేశప్రజలకు అతి తక్కువ ధరలలోనే మందులను, ఆపరేషన్లకు అవసరమయ్యే పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ పరియోజన కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 8,809 కేంద్రాలను ఏర్పాటు చేశాము. ఈ కేంద్రాల ద్వారా ఒక్క 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే ప్రజలకు రూ. 5,300 కోట్లు ఆదా అయ్యాయి. వీటితో పాటుగా దీర్ఘకాలిక వ్యాధుల మందుల ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. గర్భవతులు మొదలుకొని చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరినీ వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షించటం కోసం అవసరమైన వ్యాక్సిన్లను మిషన్ ఇంద్రధనుష్ పథకం ద్వారా అందించటం జరుగుతోంది. ఈ వ్యాక్సి న్లన్నింటినీ తగిన సమయంలో వారికి అందించి వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించటం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ ఎంతో పురోభివృద్ధిని సాధించింది. ఈ ప్రక్రియ ద్వారా 2030 నాటికి చిన్న పిల్లల మరణాలను పూర్తిగా తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
గత రెండేళ్లలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచం మొత్తాన్ని వణికించిన కరోనా నివారణ కోసం చేపట్టిన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 220 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను దేశ ప్రజలకు ఉచితంగా అందించాము. కరోనా వ్యాక్సిన్ ను తయారు చేయడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు దేశంలోని ఫార్మా కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందించారు. కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయటం కోసం కేంద్రం రూ. 35 వేల కోట్లను ఖర్చు చేసింది. ప్రపంచం మొత్తాన్ని వసుధైవ కుటుంబకంగా భావించే భారత్, ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాక్సిన్లను ఉచితంగా అందించింది.
పురాతన కాలం నుంచి భారతీయ వైద్య విధానంలో ఆయుర్వేదానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆయుర్వేదానికి పూర్వ వైభవం వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. విదేశీయులు సైతం మన ఆయుర్వేద వైద్యంపై ఆసక్తిని కనబరుస్తున్నారు. దేశ ప్రజలకు ఈ ఆయుర్వేద వైద్యాన్ని మళ్లీ చేరువ చేయటానికి వీలుగా 2023-24 నాటికి దేశవ్యాప్తంగా 12,500 ఆయుష్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తోంది.
మోదీగారి కృషి ఫలితమే యోగా దినోత్సవం..
సనాతన భారతీయ సంప్రదాయంలో యోగా ఒక భాగంగా ఉంది. ఎన్నో శారీరక, మానసిక రుగ్మతలకు యోగా ఒక చక్కని పరిష్కారం. అటువంటి యోగాను ప్రపంచానికి పరిచయం చేయటానికి నరేంద్రమోదీ గారు చేసిన కృషి ఫలితంగా 2015 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జూన్ 21 నాడు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యోగా విలువను గుర్తించిన వందలాది దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొనటమే కాకుండా, కొన్ని దేశాలు తమ పాఠశాలల్లో కూడా యోగాను భాగం చేశాయి.
పేదలకు ఉచితంగా రూ. 5 లక్షల విలువైన వైద్యం..
దేశ ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించే నరేంద్రమోదీ ప్రభుత్వం 2018 లో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కో కుటుంబానికి, ఏటా రూ. 5 లక్షల రూపాయల విలువ చేసే వైద్యాన్ని తమకు అందుబాటులో ఉన్న ఆయుష్మాన్ భారత్ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు ఉచితంగా అందిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 19 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా 4.20 కోట్లకు పైగా ప్రజలకు 28,831 ఆసుపత్రుల ద్వారా ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా దేశ ప్రజల ఆరోగ్యాన్ని ఎక్కడి నుంచైనా నిరంతరం పర్యవేక్షించటానికి చర్యలను చేపట్టాము. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 28.12 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీల పంపిణీ జరిగింది. అంతేకాకుండా ప్రజలు తమ ఇంటి నుంచే ఉచితంగా ఆరోగ్య సలహాలను పొందటానికి వీలుగా ఇ-సంజీవని టెలిమెడిసిన్ ఓపీడి సేవలను 2019 లో ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 8 కోట్లకు పైగా దేశ ప్రజలు ఉచితంగా టెలి మెడిసిన్ సేవలు పొందారు.
అందుబాటులోకి విస్తృతమైన వైద్య సేవలు..
దేశవ్యాప్తంగా ప్రజలకు వైద్యసేవలను అందుబాటులో ఉంచటం కోసం ఇలా అనేక చర్యలను చేపట్టిన నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తృతమైన చర్యలను చేపట్టింది. 2014-15 నుంచి ఇప్పటి వరకు గత ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో రూ.5,550 కోట్ల నిధులను నేషనల్ హెల్త్ మిషన్ క్రింద తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేశారు. మార్చి, 2021 లెక్కల ప్రకారం తెలంగాణలోని పట్టణాలలో 227 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 10 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, గ్రామాలలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 85 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 175 ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ పరియోజన కేంద్రాలు ప్రజలకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను అందిస్తున్నాయి. ఈ కేంద్రాలలో 1,616 రకాల మందులు, 250 సర్జికల్ పరికరాలు 50 నుండి 80 శాతం తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
టీబీ నిర్మూలన కోసం..
గత 3 సంవత్సరాల కాలంలో టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని తెలంగాణలో అమలు పరచటానికి కేంద్రం రూ. 146 కోట్లను ఖర్చు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 1,041 ఫ్లోరోసిస్ ప్రభావిత గ్రామాల్లో ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం రూ. 800 కోట్లతో చర్యలను చేపట్టి సురక్షితమైన త్రాగునీటిని ఆయా గ్రామాల ప్రజలకు అందించాము. కరోనా సమయంలో ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్ ఫేజ్ – II కింద తెలంగాణకు దాదాపు రూ.300 కోట్లు విడుదల చేశారు. వ్యాక్సిన్ల తయారీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు అందించిన ప్రోత్సాహంతో హైదరాబాద్ లోని వ్యాక్సిన్ కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్ ను తయారు చేయటంలో కీలకమైన పాత్ర పోషించాయి. రూ. 1,800 కోట్లకు పైగా విలువ గల 7.7 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందించిన ఘనత కేంద్రానిది. ఇలాంటి అనేక రకాల చర్యల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయటానికి నరేంద్రమోదీ ప్రభుత్వం అపూర్వమైన రీతిలో కృషి చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..