TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.. ఏమన్నారంటే..?
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేబినెట్‌లో కార్మికుల సమ్మెపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు సంమయనం పాటించాలని రేవంత్ సూచించారు. తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని, డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పటికీ సిద్దంగా ఉంటుందని స్పష్టం చేశారు.

టీజీఎస్‌ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికులు ప్రాణాలు తీసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదన్న సీఎం తెలిపారు. RTC కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో రేపు కార్మిక సంఘాలతో మంత్రుల చర్చలు ఉంటాయన్నారు. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అటు సంయమనం పాటించి సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దన్న మంత్రి.. ప్రాణాలు తీసుకునే అనాలోచిత చర్యలు చేపట్టొద్దని హితవు పలికారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందన్న మంత్రి.. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి లోనవ్వొద్దనీ.. క్షణికావేశంతో కొత్త సమస్యలు తెచ్చుకోవద్దని సూచించారు. ఆత్మనిర్బరంతో ఉండి.. ప్రభుత్వంతో చర్చలకు రావాలని శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు.
ఆర్టీసీ సమ్మెపై చర్చ
“ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ లో చర్చ జరిగింది. ఆర్టీసీ కార్మికులు తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు. ప్రాణాలు తీసుకోవడం అనేది బాధాకరమైన విషయం. ఈ ప్రజా పాలన – ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వం. క్షణికావేశం వల్ల అనర్థాలు జరుగుతాయి.. ప్రేరేపిత చర్యలు వద్దు. రేపు ఆర్టీసీ కార్మికులతో డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో చర్చలు ఉంటాయి. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయొద్దు. మీ కుటుంబాలకు మీ అండ అవసరం. కేబినెట్ ఎజెండా మొదలు కాకుండానే ఆర్టీసీ కేబినెట్ లో చర్చించాం” అని శ్రీధర్ బాబు అన్నారు. అటు రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. “ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి భాద్యత ఉంది. కార్మికులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. కేబినెట్ స్థాయిలో చర్చ జరగాలని కొంత ఆలస్యం అయింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రుల ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేసాం. రేపు జేఏసీ నాయకులతో చర్చలు జరుపుతాం. ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఉద్యోగాలు తీసివేస్తారు అనే ప్రచారం కరెక్ట్ కాదు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని తెలిపారు.
ముగ్గురు ఆత్మహత్యాయత్నం
అటు రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. RTC డ్రైవర్ శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై MGM హెల్త్‌బులిటెన్ విడుదల చేసింది. శంకర్ గౌడ్ పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు.. ఆయనకు 60-80శాతం కాలిన గాయాలు అయ్యాయన్నారు. మంటల వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించామన్నారు. వెంటిలేటర్‌పై శంకర్‌గౌడ్‌కు చికిత్స అందిస్తున్నామని, శంకర్‌గౌడ్ మాట్లాడే పరిస్థితిలో లేరని, చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు పేర్కొన్నారు.
