Telangana: తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 2500 ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్.. త్వరలో నోటిఫికేషన్..
తెలంగాణలో ఉద్యోగాాల జాతర మొదలైంది. త్వరలో 2500 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఆర్ధికశాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో పరీక్షల టైమ్ టేబుల్‌ను ఖారారు చేసే పనిలో టీజీపీఎస్సీ ఉంది. ఇక నుంచి నెలకో నోటిఫికేషన్ ఇవ్వనుంది.

తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. ఇక నుంచి నెలకో నోటిఫికేషన్ విడుదల కానుంది. త్వరలోనే 2500 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి ఆర్ధికశాఖ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఈ పోస్టులకు అతి త్వరలోనే టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంపై టీజీపీఎస్సీ దృష్టి సారించింది. అందులో భాగంగా అగ్రికల్చర్, పొల్యూషన్ కంట్రోల్, టౌన్ ప్లానింగ్, ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తోన్నారు. ఏఈ, డిప్యూటీ ఈఓ లాంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
షెడ్యూల్ తయారీ చేసే పనిలో నిమగ్నం
2500 పోస్టులకు ఆర్ధిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో భర్తీ చేసేందుకు షెడ్యూల్‌ను తయారుచేసే పనిలో టీజీపీఎస్సీ నిమగ్నమైంది. ఇక నుంచి పోస్టుల భర్తీలో ఆలస్యం చేయకూడదని, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. త్వరలో టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్ శాఖల్లోని అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక విద్యుత్ శాఖ, విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఇక త్వరలో ఎగ్జామ్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ తేదీల్లో కాకుండా వేరే తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. దీని వల్ల కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు రాసే అభ్యర్థులకు వెసులుబాటు ఉంటుంది.
ఓటీఆర్ అప్డేట్ తప్పనిసరి
అటు ఇటీవల టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసుకునేందుకు అధికారులు గడువు ఇచ్చారు. అయినా కొంతమంది నిరుద్యోగులు చేసుకోలేదు. గడువును రెండుసార్లు పెంచగా.. కేవలం 6 లక్షల మంది మాత్రమే అప్డేట్ చేసుకున్నారు. 30 లక్షల మంది ఓటీఆర్ కలిగి ఉండగా.. 12 లక్షల మంది మాత్రమే రెగ్యూలర్‌గా టీజీపీఎస్సీ పరీక్షలకు హాజరవుతున్నారు. దీంతో కొత్తగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ అధికారులు చెబుతున్నారు. విద్యార్హత, ఇతర డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి అప్డేట్ చేసుకోవాలి.
