MS Dhoni Robot Dog : చంపక్ కుక్కతో ధోనీ బాబు కుస్తీ.. ఆ రోబోట్ పాపం తలా దెబ్బకి షాక్ అయినట్టుంది
MS Dhoni Robot Dog : గాయం కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ.. ప్రాక్టీస్ సెషన్‌లో ఒక రోబోట్ కుక్కతో సరదాగా గడిపిన దృశ్యాలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగే భారీ పోరుకు ముందు ధోనీ తనలోని సరదా కోణాన్ని బయటపెట్టారు.

MS Dhoni Robot Dog : ఐపీఎల్ 2026లో ఎల్-క్లాసికోగా పిలవబడే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోరుకు రంగం సిద్ధమైంది. అయితే, ఈ మ్యాచ్ కంటే ముందే ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఒక క్రేజీ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. గాయం కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ.. ప్రాక్టీస్ సెషన్‌లో ఒక రోబోట్ కుక్కతో సరదాగా గడిపిన దృశ్యాలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగే భారీ పోరుకు ముందు ధోనీ తనలోని సరదా కోణాన్ని బయటపెట్టారు. చంపక్ అనే రోబోట్ డాగ్‌తో ధోనీ ఆడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ధోనీ నేలపై పడుకుని రోబోట్ కుక్క చేసే విన్యాసాలను అనుకరిస్తూ వ్యాయామం చేయడం కనిపిస్తోంది. అయితే, సరదాగా సాగుతున్న ఈ సమయంలో ధోనీ ఒక్కసారిగా వెనుకకు వెళ్లే క్రమంలో కాస్త గట్టిగా జారిపడ్డారు. ఇది చూసిన అభిమానులు ఆయన గాయం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ధోనీ మాత్రం చిరునవ్వుతో దానిని తేలికగా తీసుకున్నారు.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ధోనీ క్వాడ్రిసెప్స్ స్ట్రెయిన్ (కండరాల గాయం) బారిన పడ్డారు. దీనివల్ల ఆయన తొలి 6 మ్యాచ్‌లకు దూరమయ్యారు. జట్టుతో కలిసి ట్రావెల్ చేయకుండా కేవలం చెన్నైలోనే ఉండి కోలుకున్నారు. అయితే బుధవారం వాంఖడే స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్ కిట్ ధరించి బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడం చూస్తుంటే.. ముంబైతో మ్యాచ్‌లో ఆయన ఆడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నెట్స్‌లో గంటపాటు బ్యాటింగ్ చేసిన ధోనీ, కొన్ని బంతులను స్టాండ్స్‌లోకి పంపడం విశేషం.
Pookie Thala dropping into your feed 💛🥰#WhistlePodu #Yellove pic.twitter.com/4oP7eqdSjB
— Chennai Super Kings (@ChennaiIPL) April 22, 2026
ఈ సీజన్ ఎల్-క్లాసికోలో ఇద్దరు దిగ్గజాల లభ్యతపై సందిగ్ధం కొనసాగుతోంది. ముంబై స్టార్ రోహిత్ శర్మ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా గత 10 రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. బుధవారం ఆయన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినప్పటికీ, తుది నిర్ణయం టాస్ సమయంలోనే వైద్య బృందం తీసుకుంటుంది. ధోనీ విషయంలో కూడా బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మెడికల్ టీమ్, స్వయంగా ధోనీ సంతృప్తి చెందితేనే మైదానంలోకి అడుగుపెడతారని తెలిపారు.
వాంఖడే స్టేడియం రోహిత్, ధోనీలకు పుట్టినిల్లు లాంటిది. రోహిత్ ముంబైని 5 సార్లు ఛాంపియన్‌గా నిలబెడితే, ధోనీ ఇదే మైదానంలో 2011 ప్రపంచ కప్ సిక్సర్ బాదారు. కాబట్టి ఈ ఇద్దరూ ఈ రాత్రి మ్యాచ్‌లో తలపడితే చూడాలని కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. గాయాల మధ్య కూడా వీరిద్దరూ ప్రాక్టీస్‌లో చెమటోడ్చడం చూస్తుంటే, ఒకరు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తే, మరొకరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే అవకాశం ఉందని సమాచారం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
