Rains Update: మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు.. నెల రోజుల వాన ఒక్క రోజే!
రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ వరునుడు ప్రతాపం చూపాడు. దీంతో రాజధాని హైదరాబాద్ సహా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. రహదారులపై నీరు నిలిచిపోయాయి. 4 రోజులుగా ముసురుపట్టే..
హైదరాబాద్, జులై 21: రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ వరునుడు ప్రతాపం చూపాడు. దీంతో రాజధాని హైదరాబాద్ సహా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. రహదారులపై నీరు నిలిచిపోయాయి. 4 రోజులుగా ముసురుపట్టే ఉండటంతో బయటకాలు పెట్టే పరిస్థితిలేదు. దీంతో జనజీవనం దాదాపు స్థంభించిపోయింది. వర్షం దాటికి విద్యుత్ తీగలు తెగడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి.
మరోవైపు నెలంతా కురవవల్సిన వాన 24 గంటల్లోనే కురవడంతో సాగునీటికి కష్టాలు తీరుతాయంటూ రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేయడంలో నిమగ్నమయ్యారు. దీనికితోడు గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనమూ ఏర్పడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వీటి ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. వాయవ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా 3.45 సెం.మీ వాన పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. మెదక్ జిల్లాలో సగటున 9.46 సెం.మీ, జనగామ జిల్లాలో 9.04 సెం.మీ, సిద్దిపేట జిల్లాలో 8.10 సెం.మీ వర్షపాతం నమోదైంది. చాలా జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో చూస్తూ గురువారం ఒక్కరోజే మల్కాజిగిరిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి నెల రోజులు దాటిపోయినా వానలు సకాలంలో కురవకపోవడంతో 30 శాతానికిపైగా లోటు వర్షపాతం కొనసాగింది. ఐతే గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి తలకిందులైంది. దీంతో లోటు పూడిపోవడమేగాక 6 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. వానాకాలం సీజన్‌లో జూలై 20 నాటికి 26.46 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. గురువారం నాటికి 27.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.