ఆ రెండు పొట్టేళ్లను విడదీయడమే ఆయన చేసిన పాపమైంది.. అంతలోనే ఘోరం!
రెండు పొట్టేళ్ల మధ్య జరిగిన పోట్లాటను ఆపబోయిన ఓ గొర్రెల కాపరి దుర్మరణం పాలయ్యారు. పొట్టేళ్ల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం ఉప్పలచెలక గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పలచెలక గ్రామానికి చెందిన చిల్లిముంత కుటుంబరావు అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందిన వీర్రాజు అనే రైతు వద్ద గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. మే నెల 10వ తేదీన కుటుంబరావు గొర్రెలను మేపడానికి గ్రామంలోని కొత్త చెరువు సమీపానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో మందలోని రెండు పొట్టేళ్లు తీవ్రంగా కొట్టుకోవడం ప్రారంభించాయి.
వాటిని గమనించిన కుటుంబరావు, పోట్లాటను ఆపడానికి వాటి మధ్యలోకి వెళ్లాడు. అయితే, అప్పటికే తీవ్ర ఆవేశంతో ఉన్న ఆ రెండు పొట్టేళ్లు ఒక్కసారిగా కుటుంబరావుపైకి తిరిగి, అతడిని బలంగా ఢీకొడుతూ దాడి చేశాయి. పొట్టేళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. ఆ సమయంలో పక్కనే పశువులను కాస్తున్న ఓ మహిళ ఆలస్యంగా గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించింది.
వెంటనే స్పందించిన బంధువులు 108 వాహనంలో అతడిని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కుటుంబరావు శనివారం (మే 16) మృతి చెందాడు. మూగజీవాల పోట్లాటను ఆపబోయి ఓ కాపరి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..