Maoist Surrender: మావోయిస్ట్ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్!
మావోయిస్టు పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (GLA) చీఫ్‌గా ఉన్న బరిసె దేవా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోనున్నారు. శనివారం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోనున్నారు. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర ఎదురుదెబ్బగా భద్రతా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

హిడ్మా తర్వాత మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను చూసే కీలక నేతగా బరిసె దేవా కొనసాగుతున్నారు. హిడ్మా, బరిసె దేవా ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారిగా సమాచారం. సుదీర్ఘకాలంగా అండర్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ మావోయిస్టు మిలిటరీ వ్యూహాలు, ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో బరిసె దేవా అత్యంత కీలక లింక్‌గా వ్యవహరించారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా అత్యాధునిక ఆయుధాల నిర్వహణ, సరఫరా బాధ్యతలు ఆయన వద్దనే ఉండేవని సమాచారం. ఈ క్రమంలో దేవా వద్ద అత్యంత శక్తివంతమైన మౌంటెయిన్ LMG (లైట్ మెషిన్ గన్) వెపన్లు ఉన్నట్లు వర్గాలు తెలుసుకున్నాయి.
పోలీసుల సమాచారం ప్రకారం.. బరిసె దేవా వద్ద మొత్తం 12 మౌంటెయిన్ LMG వెపన్లు ఉన్నట్లు తేలింది. ఒక్కో LMG వెపన్‌కు హెలికాప్టర్లను సైతం కూల్చే సామర్థ్యం ఉండటం గమనార్హం. ఈ ఆయుధాలను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇది మావోయిస్టు సాయుధ బలగాలకు భారీ నష్టం అని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బరిసె దేవాతో పాటు మరికొందరు అత్యంత కీలక మిలిటరీ ఆపరేషన్ సభ్యులు కూడా డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోనున్నట్లు తెలుస్తోంది.
ఈ లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మిలిటరీ నెట్‌వర్క్ తీవ్రంగా దెబ్బతింటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న మావోయిస్టు కార్యకలాపాలపై ఇది గణనీయమైన ప్రభావం చూపనుంది. బరిసె దేవా లొంగుబాటును కేంద్ర హోంశాఖ ప్రశంసించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లొంగుబాటు, పునరావాస విధానాలకు ఇది నిదర్శనమని పేర్కొంది. మావోయిస్టులు హింసను వీడి ప్రజాస్వామ్య మార్గంలోకి రావాలని కేంద్ర హోంశాఖ మరోసారి పిలుపునిచ్చింది.
శనివారం లొంగుబాటు అనంతరం బరిసె దేవా మీడియా ముందుకు రానున్నట్లు సమాచారం. తన లొంగుబాటు వెనుక కారణాలు, మావోయిస్టు పార్టీ అంతర్గత వ్యవహారాలపై కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమ భవిష్యత్తుపై కీలక మలుపుగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




