Telangana: కబడ్డీ కోర్టులో ఆ వ్యక్తి దహన సంస్కారాలు.. ఎందుకో తెల్సా..?
కబడ్డీ అంటే అతనికి ఎంతో ఇష్టం. కబడ్డీ నేర్చుకొని ఎంతోమందికి దాన్ని నేర్పించిన వ్యక్తి. అతని వల్ల ఎంతోమంది కబడ్డీ క్రీడాకారులు అయ్యారు.. అయితే తమకు కబడ్డీ నేర్పిన గురువు అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. అతని దహన సంస్కారాలను చాలా వినూత్నమైన విధముగా చేసి, ఆయనకు ఘన నివాళులు అర్పించారు ఆ గ్రామస్థులు.. వివరాల్లోకి వెళ్తే..

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి అనే గ్రామంలో ఇటీవల మృతి చెందిన సంపత్ అనే కబడ్డీ క్రీడాకారుడి చితిని కబడ్డీ కోర్ట్ ఏర్పాటు చేసి అందులో దహన సంస్కారాలు చేశారు తోటి మిత్రులు, గ్రామస్థులు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కబడ్డీ ప్రేమికుడి అంత్యక్రియలను ఇలా వినూత్నరీతిలో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వద్ద సంక్రాంతి పండుగ రోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి కబడ్డీ సీనియర్ క్రీడాకారుడు పులికాశి సంపత్ మృతి చెందాడు. దీంతో మృతుడి స్వగ్రామమైన అక్కన్నపేట మండలం చౌటపల్లిలో కబడ్డి క్రీడాకారులు, స్నేహితులు, గ్రామస్తులు కబడ్డీ కోర్టు వేసి, దానిని పూలతో నింపి సంపత్ అంత్యక్రియలు నిర్వహించారు.
సంపత్ తన యుక్త వయసు నుంచి కబడ్డీలో రాణించాలని ఉవ్విళ్లూరేవాడు. కానీ కుటుంబ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా, మధ్యలోనే దాన్ని వదిలివేసి లారీ డ్రైవర్‌గా మారి పోయాడు. ఆ తర్వాతి కాలంలో గ్రామంలో చాలా మంది యువకులను ప్రోత్సహించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు పంపించాడు సంపత్. అలా కబడ్డీపై తన మక్కువను ప్రదర్శించి తృప్తి పొందాడు… ఆయన ప్రోత్సాహంతోనే జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా గంగాధరి మల్లేష్ రాణించి, ప్రస్తుతం ప్రో కబడ్డీలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. సంపత్ మరణ వార్త విని చాలా మంది కబడ్డీ క్రీడాకారులు గ్రామానికి వచ్చి ఆయన దహన సంస్కారాలు ఇలా కబడ్డీ కోర్ట్ వేసి అందులో జరిపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..