Telangana: తెల్లారి కల్లాపి చల్లుతున్న మహిళకు మెరుస్తూ కనిపించింది.. దగ్గరకెళ్లి చూడగా
ఇదో విచిత్ర ఘటన. అసలే బంగారం ధరలు అమాంతం పెరుగుతున్న వేల దొంగిలించిన బంగారం తిరిగి అప్పగించడం చూసారా..! కానీ జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో ఓ ఇంట్లో చోరికి పాల్పడ్డ దొంగలు మానవత్వాన్ని చూపారు. ఆ ఇంటి మహిళ రోదన, ఆవేదన టీవీ లో చూసి కనికరించారు.

ఈ వింత సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కేసముద్రం మండలం తాళ్ళపూసపల్లి గ్రామంలో వారం రోజుల క్రితం చోరీ జరిగింది. ఇంటి గుమ్మం ముందు గూటిలో పెట్టిన తాళం చెవి తీసుకొని ఇంటి తాళం తెరిచి దర్జాగా దొంగతనానికి పాల్పడ్డారు గుర్తుతెలియని దొంగలు. ఇంట్లో డబ్బాలో దాచిన 6 తులాల బంగారు ఆభరణాలు, 17 తులాల వెండి ఆభరణాలు, 6 నగదు చోరీ చేశారు. ఇంటి యజమానురాలు ఆనసూర్య ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇళ్లు గుళ్ళ అయింది.. దర్జాగా తాళంచెవి తీసుకొని దోపిడీకి పాల్పడ్డారు..ఇంట్లో దొంగలుపడ్డ విషయం గమనించిన బాధితురాలు కన్నీరుమున్నీరు గా విలపించింది.. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇంటి తాళాలు గూటిలో పెడుతారని తెలిసిన వాళ్ళే ఈ చోరి చేసి ఉంటారని అంతా భావించారు. పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా చోరికి గురైన బంగారం, వెండి ఆభరణాలు ఇంటి ముందు లభ్యమయ్యాయి. నిన్న ఉదయం భారీ వర్షం కురుస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇంటి ముందు పడేసి వెళ్లిపోయాడు. ఆనసూర్య ఉదయాన్నే ఇంటిముందు శుభ్రం చేస్తున్న క్రమంలో తన బంగారం, వెండి ఆభరణాలు గమనించి అవాక్కయింది. ఇరుగుపొరుగు వాళ్లని పిలిచి తన ఆభరణాలు తాను తీసుకుంది. తన బాధను గమనించి కనికరించిన దొంగలకు అనసూర్య కృతజ్ఞతలు తెలిపింది.




