Telangana: వామ్మో పులి.. యానిమల్ ఈటర్ నుంచి మ్యాన్ ఈటర్‌గా మారిన బెబ్బులి..!

నవంబర్ నెల నుండి మొదలవుతున్న పులి రక్త దాహం చలి‌కాలమంతా సాగుతుందడంతో అటు చలి నుండి ఇటు పులి నుండి కాపాడుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు గిరిజనులు.

Telangana: వామ్మో పులి.. యానిమల్ ఈటర్ నుంచి మ్యాన్ ఈటర్‌గా మారిన బెబ్బులి..!
Tiger
Follow us
Naresh Gollana

| Edited By: Balaraju Goud

Updated on: Nov 30, 2024 | 8:54 AM

అడవుల జిల్లా ఆదిలాబాద్ ప్రజలు నవంబర్ నెల పేరెత్తితేనే గజగజవణికిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు నాలుగేళ్లుగా ఈనెల ఆ జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకటో రెండో ఊర్లను కాదు ఐదారు మండలాలనే గజగజ వణికిస్తోంది. పనులకు వెళ్లాలన్నా.. బడులకు వెళ్లాలన్నా భయంతో వణికిపోక తప్పడం లేదు. కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

నవంబర్ వచ్చిదంటే అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌ను చలి‌ వణికిస్తోంది. అయితే గత నాలుగేళ్లుగా ఈ ప్రాంతాన్ని చలి మాత్రమే కాదు మృగరాజు పులి కూడా గజగజ వణికిస్తోంది. వణికించడం అంటే అలా ఇలా కాదు ఏకంగా ప్రాణాలే తీసేస్తోంది. పశువులు, మనుషులు అన్న తేడా లేదు.. రక్తం రుచి మరిగిన బెబ్బులి ఎదురు పడ్డ ప్రతి ప్రాణిని హతం చేస్తోంది. నక్కినక్కి పంజా విసిరి ప్రాణాలు తోడేస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడాది కి ఒకరు అన్నట్టుగా నాలుగేళ్లలో పులి ఆకలికి నలుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇక్కడితోనే మ్యాన్ ఈటర్ ఆట ఆగిపోతుందన్న నమ్మకం లేదంటోంది కాగజ్ నగర్ కారిడార్ ప్రాంత జనం.

2020 నుండి మొదలైన పులుల దాడులు.. స్టిల్ కంటిన్యూ అన్నట్టుగానే సాగుతున్నాయి. కాగజ్ నగర్ కారిడార్ లోని దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన సిడం విఘ్నేశ్ (20 ) అనే యువకుడిని 2020 నవంబర్ 11 న పులి దాడి చేసి హతమార్చింది. ఆ ఘటన మరువక ముందే అదే నెలలో కాగజ్ నగర్ డివిజన్ పెంచికల్ పేట్ మండలం కొండపల్లిలో నవంబర్ 29 న చేనులో పత్తి ఏరుతున్న పసుల నిర్మల(19) అనే యువతిపై పులి దాడి చేసి పొట్టన పెట్టుకుంది. ఈ రెండు ఘటనలు మరువక ముందే 2022 లో కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్ శివారు అటవి ప్రాంతంలో నవంబర్ 16న వాంకిడి మండలం చౌపన్ గూడ పరిధిలోని ఖానాపూరు కు చెందిన గిరిజన రైతు సిడాం భీము(69) పై పంజా విసిరి హతం చేసింది పులి.

తాజాగా నవంబర్ 29 న కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ , బెంగాలీ క్యాంప్ విలేజ్ నెంబర్ 9-11 మధ్య అటవీ సమీపంలోని పత్తి చేనులో పత్తి పనులు చేస్తున్న మోర్ల లక్ష్మి(21) అనే యువతిని బలి తీసుకుంది బెబ్బులి. ఇలా వరుస దాడులతో కాగజ్ నగర్ కారిడార్ జనం భయంతో వణికిపోతోంది. ఎటు వైపు‌పులి‌వచ్చి దాడి చేస్తుందో ఎక్కడ ప్రాణాలు గాల్లో కలుస్తాయో అని భయంతో వణికిపోతోంది ఈ ప్రాంతం.

మనుషులపై దాడి చేసి చంపేస్తున్న బెబ్బులుల తీరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. భారీ ఆకారం, భీకరమైన గాండ్రింపులతో వెళ్తున్న క్రూర మృగాన్ని చూస్తూ ఆందోళన చెందుతున్నారు గిరిజనులు. నవంబర్ నెల పత్తి పనులకు కీలకం కావడం.. ఉమ్మడి ఆదిలాబాద్ అటవి సమీప ప్రాంతాల్లోని పత్తి చేళ్లను ఏపుగా పెరిగి దండిగా పత్తి పండటం.. ఆ పత్తిని ఏరేందుకు సమీప ప్రాంతాల నుండి వస్తున్న వ్యవసాయ కూలీలపై పులి దాడులు చేయడం పరిపాటిగా మారిపోతున్నాయి.

మరో వైపు నవంబర్ నెల పులుల జతకట్టే సమయం కావడంతో విరహ వేదనతో.. తోడును వెతుక్కుంటూ మహారాష్ట్ర నుండి వలస వస్తున్న పులులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచరిస్తూ.. ఆకలి తీర్చుకోవడానికి అడ్డొచ్చిన పశువులు, మనుషులపై దాడి చేసి చంపేస్తున్నాయి. 2020 నుండి ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 235 పశువులు, నలుగురు మనుషులు బెబ్బులి పంజాకి రక్తపుమడుగుల్లో కుప్పకూలడం భయాన్ని పెంచుతోంది. మరోవైపు అటు కవ్వాల్ అభయారణ్యం నుండి మొదలు ఇటు కాగజ్ నగర్ కారిడార్ వరకు అటవీశాఖ అధికారులు పులి ట్రాకింగ్ విషయంలో ఎక్కడికక్కడ విఫలమవుతుండటం కూడా దాడులు పెరగడానికి కారణం అవుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ కు చుట్టూ నలువైపుల నాలుగు టైగర్ జోన్ ప్రాంతాలు ఉండటం.. అక్కడ పులుల సంఖ్య పెరగడం.. ఆవాసం కోసం పులులు సరిహద్దులు దాటడం సర్వసాధారణంగా మారింది. వలస వస్తున్న పులులతో అటవీశాఖ హర్షం వ్యక్తం చేస్తున్నా.. వాటి వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమవుతోంది అటవీశాఖ. అటవీ అధికారుల దగ్గర సమాచారం ఉన్నా.. గ్రామస్తులను అలర్ట్ చేయడంలో విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్, ఛత్తీస్ గఢ్ లోని ఇంద్రావతి అభయారణ్యాల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న పులులు ఆవాసం కోసం అలుపెరుగని ప్రయాణం చేస్తున్నాయి. మహారాష్ట్ర కిన్వట్ నుండి గత నెల నిర్మల్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన ఆరున్నరేళ్ల మగ పులి జానీ విరహ వేదనతో ఏకంగా 400 కిమీల పైగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంచరించగా.. మరో మూడున్నరేళ్ల మగ పులి గత నెల రోజులుగా మంచిర్యాల జిల్లా కవ్వాల్ అడవుల్లో సంచరిస్తూ కనిపించింది. 2019 లో వలస వచ్చి కాగజ్ నగర్ , పెంచికల్ పేట్ మండలాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్న ఓ నాలుగు పులు ఇక్కడే సంచరిస్తున్నాయి.

తాజాగా నజ్రూల్ నగర్ విలేజ్ నంబర్ 11 లో మోర్ల లక్ష్మి పై దాడి చేసిన బెబ్బులి.. అసలు ఎటు నుండి ఎటు వైపు వెళుతుందో కూడా గుర్తించలేకపోతోంది అటవీశాఖ. పులుల కదలికలపై అటవీ అధికారులకు సమాచారం ఉన్నా ట్రాకింగ్ విషయంలో సమన్వయం లేకపోవడం, ప్రజలకు పూర్తి స్థాయిలో పులి గురించి అవగాహన కల్పించకపోవడంతో నవంబర్ మాసం డేంజర్ నెలగా మారుతోంది. మరో వైపు పులి దాడిలో ప్రాణాలు కోల్పోతున్న బాధిత కుటుంబాలకు సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్ర స్థాయిలో న్యాయం జరగడం లేదు. అక్కడి నుండి వలస వస్తున్న పులులు.. ఇక్కడ దాడి చేస్తుంటే.. న్యాయం మాత్రం మహారాష్ట్ర తరహాలో‌ దక్కడం లేదు.

పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యాలలో పులుల దాడిలో మనిషి చనిపోతే రూ.25 లక్షలు ఆర్థిక సాయంగా అక్కడి ప్రభుత్వం అందజేస్తుంటే.. తెలంగాణలో మాత్రం రూ.10 లక్షలకే పరిమితం అయింది. అది కూడా తక్షణ సాయంగా అందడం లేదు. 2020లో ఇద్దరు, 2023లో ఒకరు, తాజాగా కాగజ్ నగర్ మండలంలో లక్ష్మి అనే మహిళ పులి పంజాకు బలయైనా వారికి దక్కిన న్యాయం అంతంతగానే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకుని ఉండే తడోబా, తిప్పేశ్వర్ అభయారణ్యాల నుంచే పులులు తరచూ మన ప్రాంతానికి వస్తున్నా… ఏటా నవంబర్ నుంచి జనవరి మధ్యలో పులులు జతకట్టే సమయంలోనే మనుషులపై దాడులు జరుగుతున్నాయి.

మరో వైపు నవంబర్ నెల నుండి మొదలవుతున్న పులి రక్త దాహం చలి‌కాలమంతా సాగుతుందడంతో అటు చలి నుండి ఇటు పులి నుండి కాపాడుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు గిరిజనులు. పులి మనుషులను చంపేసి వెళుతున్నా.. పులి కదలికలు, ఫొటోల పట్ల అటవీ అధికారులు గోప్యత పాటిస్తుండటం కూడా ప్రమాదాలను మరింత పెంచుతోంది. వేటగాళ్ల ఉచ్చులకు పులులు, పులుల పంజాకు మనుషులు ప్రాణాలు వదులుతున్నా భద్రత సాకు చూపుతూ అటవీ శాఖ చేతులు దులుపుకుంటోందని గిరిజనులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.

నవంబర్ నెలలో పులి‌ జత కట్టే సమయం అని తెలిసినా.. పులి తోడు కోసం సాగించే ప్రయాణంలో ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పదని తెలిసినా ఉమ్మడి ఆదిలాబాద్ అటవీశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తనట్టుగానే నడుచుకుంటోందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా నవంబర్ నెల ఉమ్మడి ఆదిలాబాద్ జనాన్ని నాలుగేళ్లుగా భయపెడుతూనే ఉంది. ఇప్పట్లో నవంబర్ నెల భయానికి ఎండ్ కార్డ్ పడేలా మాత్రం కనిపించడం లేదు..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…