సాగూ లేదు తాగూ లేదు.. కృష్ణమ్మ చుట్టూ అన్నీ రాజకీయ రభసలే..!
విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎడతెగని సమస్యలు బోలెడన్ని. పరిష్కారాల కోసం మార్గాలు వెతుకుతూనే ఉన్నారు. కానీ.. ప్రతీ సంవత్సరం సమ్మర్ వస్తే చాలు ఒక సమస్య మాత్రం వేడివేడిగా కొత్తగా పుట్టుకొస్తుంది. కృష్ణా నదిలో నీళ్లు తక్కువ, దానిమీద కట్టిన ప్రాజెక్టులు ఎక్కువ. గోదావరి నదిలో నీళ్లు ఎక్కువ.. ప్రాజెక్టులు తక్కువ. వీటిపై వేసవి కాలానికి ముందే ఇద్దరు ముఖ్యమంత్రులను వేధిస్తున్న ఆ సంక్షోభం ఏమిటో చూద్దాం.

కృష్ణా నదిలో నీళ్లు తక్కువ, దానిమీద కట్టిన ప్రాజెక్టులు ఎక్కువ. గోదావరి నదిలో నీళ్లు ఎక్కువ.. ప్రాజెక్టులు తక్కువ. అందుకే జల వివాదాలూ తక్కువే. గోదావరి విషయంలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌తో పెద్దగా నీళ్ల పంచాయతీ లేనే లేదు. కానీ.. కృష్ణానదితోనే వచ్చింది గొడవంతా. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కల్పించుకున్నా.. కృష్ణవేణి చెంత రాజకీయ మంటలు మాత్రం చల్లారలేదు. నీటి జాడ లేక బావులన్నీ ఎండమావులౌతుంటే బతుకులన్నీ ఎండిపోతుంటే.. వేసవి సీజన్ ముంచుకొచ్చి నడినెత్తిన కూర్చుంటానంటుంటే.. సాగు-తాగు నీళ్ల అవసరాలు గుర్తుకొచ్చి నదీజలాల వాటాలపై సీరియస్‌గా దృష్టి పెట్టాయి రెండు తెలుగు ప్రభుత్వాలు. ఓ దొరా మా దొరా.. ఊతమియ్యరా.. అని ఏలినవాళ్లను వేడుకోవడాలే తప్ప.. బీళ్లను బంగరు చేలుగా మార్చాలన్న చిత్తశుద్ధులు అక్కడున్నట్టా లేనట్టా..? పట్టువిడుపుల ఊసే లేకుండా.. చెరోపక్క లాగుతూనే ఉన్నాయి రెండు ప్రభుత్వాలు. రాజకీయాలొద్దంటూనే రాజకీయాలు మాత్రమే చేస్తున్నాయి. పదేళ్లు దాటినా.. ప్రభుత్వాలు మారినా.. అదే లొల్లి.. ప్రతీ వేసవికీ బార్డర్లో తప్పని అలజడి. సాగూ లేదు తాగూ లేదు.. రాజకీయ రభసలే తప్ప! రెండురాష్ట్రాల మీదుగా సాగుతున్న కృష్ణా, గోదావరి నదుల్లో నీళ్ల వాటాలు తేలక.. తెలుగురాష్ట్రాల మధ్య నిప్పులు కురుస్తూనే ఉన్నాయి. వివాదాల పరిష్కారం కోసం కెఆర్‌ఎంబీ, జీఆర్ఎంబీ పేర్లతో మేనేజ్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేసినా.. అవన్నీ ఉన్నా లేనట్టు.. ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నాయి. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలను వాళ్లు ఏకరూవు పెట్టుకుంటూ.. వాళ్ల వాళ్ల రాష్ట్రాల్లో ఓటు బ్యాంకులు...
