Rain Alert: రాష్ట్ర వాసులకు కూల్ న్యూస్.. వచ్చే మూడు రోజులు చిరు జల్లులు!
గత వారం రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. జనాలు బయటకు వచ్చేందుకు గజగజలాడిపోతున్నారు. ఏప్రిల్ నెల రాకముందే ఎండల భగభగలు రాష్ట్ర వాసులకు దడపుట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ కేంద్ర రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. వచ్చే మూడు రోజులు స్పల్పంగా ఉష్ణోగ్రతలు..

హైదరాబాద్, మార్చి 31: తెలుగు రాష్ట్రాల్లో భాణుడి భగభగలు జనాలను హడలెత్తిస్తున్నాయి. కేవలం మార్చి నెలలోనే ఎండలు ఠారెత్తిస్తుంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి తీవ్రంగా ఉండనుంది. అయితే ఎండల నుంచి కాస్త రిలీఫ్ చెందే వార్త వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్య చత్తీస్గడ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం బలహీనపడింది. దక్షిణ ఛత్తీస్గడ్ నుండి అంతర్గత మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటక మీదుగా అంతర్గత తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో గత రెండు రోజులతో పోల్చితే రాగల మూడు రోజులు స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాలలో 38 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
సోమవారం గరిష్టంగా ఆదిలాబాద్ లో 41.8 కనిష్టంగా నల్లగొండ లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం తెలంగాణ లోని భద్రాచలం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, నల్లగొండ, హనుమకొండ లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనాయి. భద్రాచలం..40.4, ఆదిలాబాద్..40.3, మహబూబ్ నగర్..39.9, మెదక్..39.6, నిజామాబాద్..39.5, హైదరాబాద్..38.8, ఖమ్మం..38.6, రామగుండం..38.6, నల్లగొండ..38.5, హనుమకొండ..38.4 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు ఎలా ఉన్నాయంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం (మార్చి 31) 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా-8, విజయనగరం జిల్లా-9, పార్వతీపురంమన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-2, తూర్పుగోదావరి-8, ఏలూరు వేలేరుపాడు మండలాల్లో వడగాలులు వీస్తాయి. నేడు అల్లూరి సీతరామరాజు చింతూరు, కూనవరం మండలంలో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆదివారం 4 మండలాల్లో తీవ్రవడగాలులు, 23 మండలాల్లో వడగాలులు వీస్తాయి. ప్రకాశం(D) అమ్మని గుడిపాడు, వైఎస్సార్(D) సిద్ధవటంలో 41.9°C, అన్నమయ్య(D) కంబాలకుంట, నంద్యాల(D) ఆళ్లగడ్డలో 41.5°C, అల్లూరి(D) ఎర్రంపేట,అనకాపల్లి(D) మాడుగుల, అనంతపురం(D) నాగసముద్రంలో 40.9°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదు.




