Hyderabad: కానిస్టేబుల్ పరీక్ష సరిగా రాయలేదని.. యువకుడు ఆత్మహత్య!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు హాజరైన ఓ యువకుడు తాను సరిగ్గా పరీక్ష రాయలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన జగద్గిరిగుట్టలో..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు హాజరైన ఓ యువకుడు తాను సరిగ్గా పరీక్ష రాయలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జగద్గిరిగుట్ట, వెంకటేశ్వర నగర్‌కు చెందిన సాయికిరణ్ (26) తన అన్నయ్యలా పోలీస్ కానిస్టేబుల్ కావాలని కలలుగన్నాడు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలి రెండు దశలైన ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షల్లో సైతం ఉత్తీర్ణత సాధించాడు. ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షకు కూడా హాజరయ్యాడు. ఐతే ఈ పరీక్ష తాను సరిగ్గారాయలేదని, తనకు కానిస్టేబుల్ ఉద్యోగం రాదేమోనని స్నేహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేశాడు. తీవ్ర మనస్తాపం చెందిన సాయి కిరణ్ జగద్గిరిగుట్టలోని తన ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటన.. పిల్లనిస్తలేరని యువకుడి సూసైడ్
ఆర్థిక ఇబ్బందులతో పాటు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నశంకరం పేట మండలం శాలిపేట గ్రామానికి చెందిన రాగుల ఆంజనేయులు గౌడ్ (28) తల్లి సుజాతతో కలిసి గవ్వలపల్లిలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గతంలో అన్న యాదగిరి గౌడ్‌ను హత్య చేసిన కేసులో ఆంజనేయులు గౌడ్ ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. తనకు ఎవరూ పని ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. పెళ్లి సంబంధాలు కూడా రాకపోవడంతో మనోవేదనకు గురై గురువారం ఇంట్లో ఫ్యాన్ ఉరేసుకున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.