పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయకపోతే మా ప్రతాపం చూపిస్తాం.. గవర్నర్‌కు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ అల్టిమేటం.
Telangana: యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందని, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెలగాటమాడుతున్నారని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో..

Telangana: యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందని, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెలగాటమాడుతున్నారని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పెండింగ్ ఫైల్స్ వెంటనే క్లియర్ చేయకపోతే తమ ప్రాతాపమేంటో చూపిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఇందులో భాగంగానే చలో రాజ్ భవన్‌కు పిలుపునిచ్చారు. శనివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో.. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన ‘ యూనివర్సిటీల బోధనాసిబ్బంది కామన్ రిక్రూట్మెంట్ బిల్లు ‘ ను గవర్నర్ తొక్కి పెట్టారని జేఏసీ ఫైర్ అయ్యింది.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ‘తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చెలగాటమాడుతోంది. కేంద్ర ప్రభుత్వం పంపించిన బిల్లును వెంటనే ఆమోదించడం తప్ప, ఇతర అలంకారాలు లేనటువంటి గవర్నర్.. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రజాస్వామ్య విరుద్ధమైన ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్లు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఇదే రకమైన అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుండడం దేశం యావత్తు గమనిస్తోంది. తెలంగాణ గవర్నర్ కేంద్ర ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తూ, రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించిన బిల్లును తొక్కిపెట్టి, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం శోచనీయం, దురదృష్టకరం’ అని అన్నారు.
ఇక గవర్నర్ అవలంభిస్తున్న ఈ అప్రజాస్వామిక చర్యను అధిగమించడానికి.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థుల ఐక్యకారాచరణ సమితి ప్రత్యక్ష చర్యకు దిగాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే గవర్నర్‌కు అల్టిమేటం జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో ఫైలు క్లియర్ చేసి పంపించకపోతే.. వేలాది మంది విద్యార్థులు గవర్నర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి, విద్యార్థుల ప్రతాపం ఏంటో చూపిస్తాం..బుద్ధి చెప్తామన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థిలోకం భారీగా కదలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..



