Telangana Police Welfare: తెలంగాణ పోలీసులకు డబుల్ ధమాకా.. గృహ రుణం పెంపు, వడ్డీ తగ్గింపు.. పిల్లల విదేశీ విద్యకు రూ.30 లక్షలు
తెలంగాణ పోలీసులకు శుభవార్త.. క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని ఐపీఎస్ అధికారుల వరకు ఉత్సాహం కలిగించేలా డీజీపీ మహేందర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
Telangana Police Welfare: తెలంగాణ పోలీసులకు శుభవార్త.. క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని ఐపీఎస్ అధికారుల వరకు ఉత్సాహం కలిగించేలా డీజీపీ మహేందర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పోలీసు సిబ్బందికి గృహ రుణ పరిమితి పెంచి, వడ్టీ రేటు తగ్గించారు. సిబ్బంది పిల్లలు విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రుణ పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన భద్రత, ఆరోగ్య భద్రత ట్రస్ట్ బోర్డు భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం జరిగిన భద్రత, ఆరోగ్య భద్రత ట్రస్ట్ బోర్డు సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోలుకు వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు రుణ పరిమితిని పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. హౌసింగ్ రుణానికి చెల్లించాల్సిన వడ్డీని 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించారు. ఇళ్ల కొనుగోలుకు అర్హతగా ఉన్న అయిదేళ్ల సర్వీసును రెండేళ్లకు కుదించారు.
✧ ప్రస్తుతం ఇల్లు కట్టుకునేందుకు ఏఎస్సై స్థాయి వరకు రూ.35 లక్షలు.. ఎస్సై, సీఐలకు రూ.45 లక్షలు.. డీఎస్సీ, అదనపు ఎస్పీలకు రూ.55 లక్షలు, నాన్‌కేడర్ ఎస్పీ, ఐపీఎస్‌లకు రూ.65 లక్షల రుణ పరిమితి ఉంది. ఈ మొత్తాన్ని రూ.5 లక్షల చొప్పున పెంచారు.
✧ ఫ్లాట్ కొనేందుకు ఏఎస్సై స్థాయి వరకు రూ.20 లక్షలు.. ఎస్సై, సీఐలకు రూ.25 లక్షలు.. డీఎస్పీ, అదనపు ఎస్పీలకు రూ.30 లక్షలు.. నాన్‌కేడర్ ఎస్పీ, ఐపీఎస్‌లకు రూ.40 లక్షల చొప్పున ఉన్న రుణ పరిమితిని మరో రూ.5 లక్షల చొప్పున పెంచారు.
✧ పోలీస్ కుటుంబాల్లోని విద్యార్థుల విదేశీ విద్య కోసం కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి వరకున్న రూ.15 లక్షలను రూ.30 లక్షలకు, డీఎస్పీ నుంచి ఆపై స్థాయి అధికారులకున్న రూ.25 లక్షలను రూ.30 లక్షలకు పెంచారు.
✧ విదేశీ విద్య రుణాల చెల్లింపు వ్యవధిని 120 నెలల నుంచి 180 నెలలకు పెంచారు.