Governor Tamilisai: టీకానే మనకు ఆయుధం.. గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ వేసుకున్న గవర్నర్ తమిళిసై..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కె.సి.తండాలో గిరిజనులతో కలిసి గవర్నర్ తమిళిసై కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు.
కోవిడ్ వ్యాప్తి చెందుతున్న సమయంలో వ్యాక్సిన్ వేసుకోవడమే మనకు ఆయుధం అని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. అందరూ టీకా తీసుకొని కరోనా నుంచి రక్షణ పొందాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కె.సి.తండాలో గిరిజనులతో కలిసి గవర్నర్ తమిళిసై కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో గవర్నర్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్ నమోదు తక్కువగా జరుగుతోందని తెలిసి వచ్చినట్లు వెల్లడించారు.
స్వదేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తీసుకోగలగడం మనందరికీ గర్వకారణమని అన్నారు. సొంత వ్యాక్సిన్‌తో ప్రపంచానికి, విమర్శకులకు ఆదర్శంగా నిలిచామని చెప్పుకొచ్చారు. గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా నియంత్రణలో, వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. గవర్నర్ కేసీ తండాకు వచ్చి గిరిజనుల్లో వ్యాక్సిన్‌పై అవగాహన తీసుకురావడం అభినందనీయమని… గిరిజన మహిళల్లో టీకాపై ఉన్న భయాలను పోగొట్టేందుకు గవర్నర్ ఇక్కడికి వచ్చారని… స్ఫూర్తిగా తీసుకొని వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.