Kongu Nadu: ప్రత్యేక రాష్ట్రం దిశగా “కొంగునాడు”.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర సర్కార్..
Kongu Nadu: పది జిల్లాల కొంగునాడు ప్రాంతాన్ని రాష్ట్రం నుంచి విడదీసేందుకు రంగం సిద్ధమైందా? కొంగునాడును కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసేందుకు BJP నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందా?
తమిళనాడులో రాష్ట్ర విభజన ఉద్యమం.. తొమ్మిది జిల్లాల పరిధిలో ఉన్న”కొంగునాడు”ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని అక్కడ ఉద్యమం మొదలైంది.. ఈ ఉద్యమాన్ని బీజేపీ లీడ్ చేయడం విశేషం.. మరోవైపు అన్నాడీఎంకే కూడా కొంగునాడు రాష్ట్ర విభజనకి అనుకూలంగా ఉంది.. ఈ కొంగునాడు పరిధిలో అన్నాడీఎంకే బలంగా ఉంది. మాజీసీఎం పలని స్వామి కూడా ఇక్కడివారే.. ఇపుడున్న తమిళనాడులో బీజేపీ ఎప్పటికీ బలపడదు..అందుకే రాష్ట్రాన్ని చీల్చి కొత్త రాష్ట్రంలో బలపడాలనేది బీజేపీ ప్లాన్.. వేగంగా అడుగులు పడుతున్నాయి..
పది జిల్లాల కొంగునాడు ప్రాంతాన్ని రాష్ట్రం నుంచి విడదీసేందుకు రంగం సిద్ధమైందా? కొంగునాడును కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసేందుకు BJP నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందా? అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. వ్యూహకర్తలు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే త్వరలోనే కొంగునాడు తమిళనాడు నుంచి విడివడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార డీఎంకే కూడా అసలు ఏం జరుగుతోందో ఆరా తీసే పనిలో నిమగ్నమైపోయింది. కేంద్రప్రభుత్వాన్ని ‘ఒండ్రియ అరసు’ అంటూ DMK పేర్కొనడంపై కమలదళాధిపతులు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే.
తమను ‘ప్రత్యేకం’గా సంబోధిస్తున్న DMK తీరు పట్ల వారు కినుకవహించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పడమర ప్రాంతంగా ఉన్న కొంగు మండలాన్ని ‘కొంగునాడు’ పేరిట ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ విజయం సాధించి అధికారం చేపట్టిన డీఎంకే కొంగు మండలంలో మాత్రం తన ఉనికిని అంతంతమాత్రంగానే చాటుకుంది.
దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ హయాం నుంచి కొంగుమండలం అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉంది. ఇప్పుడూ అదే కొనసాగింది. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా కొంగుమండలంలో మాత్రం ఉనికిని చాటుకుంది. రాష్ట్ర పడమర ప్రాంతంగా ఉన్న కొంగు మండలంలో కోయంబత్తూర్, తిరుప్పూర్, ఈరోడ్, నామక్కల్, సేలం, ధర్మపురి, నీలగిరి, కరూర్, కృష్ణగిరి, దిండుగల్ జిల్లాలుండగా, ఈ మండలంలో 10 లోక్‌సభ స్థానాలు, 61 శాసనసభ స్థానాలున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో 40 స్థానాల్లో అన్నాడీఎంకే విజయం సాధించగా, 16 స్థానాల్లో డీఎంకే, 2 స్థానాల్లో బీజేపీ నిలిచాయి.
కొంగుమండలంలో విస్తరించేందుకు అటు అధికార DMK, ఇటు BJP పోటీపడుతున్నాయి. మక్కల్ నీది మయ్యం మాజీ ప్రధాన కార్యదర్శి మహేంద్రన్ DMKలో చేరిన సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణంగా మారుతున్నాయి. మహేంద్రన్ చేరికతో కొంగు మండలంలో DMK బలపడుతుందని స్టాలిన్ వ్యాఖ్యానించడం ఆ పార్టీకి ఆ ప్రాంతంలో ఎంత బలముందు అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో ఈ మండలంపై స్టాలిన్ ప్రత్యేక దృష్టి సారించినా ఆశించిన ఫలితాలు దక్కలేదు.
తాజాగా, కొంగు మండలాభివృద్ధికి సీఎం దృష్టి సారించారు. అదే సమయంలో BJP కూడా కొంగు మండలంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఈ మండలంలో బీజేపీకి చెప్పుకోదగినస్థాయిలో ఓట్లు పోలవ్వగా, ఆ పార్టీ గెలిచిన నాలుగు స్థానాల్లో ఇక్కడే ఉండడం విశేషం. అలాగే, కొంగుమండలానికి చెందిన చెందిన BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు L.మురుగన్ ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
ఆయన బయోడేటాలో కూడా ‘కొంగునాడు, తమిళనాడు’ అని పేర్కొనడం గమనార్హం. అలాగే, తాజాగా అదే మండలానికి చెందిన మాజీ IPS అధికారి అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పటికే కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మండలంలో బీజేపీ ఓటు బ్యాంక్ పెరగడంపైనా ఆ పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. అయితే ముందుగా కొంగునాడు ఏర్పాటు గురించి వ్యూహం రచించింది. 2024లోపు ఈ తతంగాన్ని పూర్తి చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలిసింది.