AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్, మహారాష్ట్రను వెనక్కు నెట్టి అగ్ర స్థానంలో తెలంగాణ.. వెల్లడించిన కేంద్ర గణాంకాలు..!

తెలంగాణకు ప్రభుత్వ భూములే అతిపెద్ద బలం అని మరోసారి రుజువైంది. పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న 76 వేల ఎకరాల భూముల ఉన్నాయి. దీంతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) విడుదల చేసిన ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ రిపోర్టులో ఈ విషయం స్పష్టమైంది.

గుజరాత్, మహారాష్ట్రను వెనక్కు నెట్టి అగ్ర స్థానంలో తెలంగాణ.. వెల్లడించిన కేంద్ర గణాంకాలు..!
Telangana Industrial Land Bank
Prabhakar M
| Edited By: |

Updated on: Jan 17, 2026 | 1:18 PM

Share

తెలంగాణకు ప్రభుత్వ భూములే అతిపెద్ద బలం అని మరోసారి రుజువైంది. పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న 76 వేల ఎకరాల భూముల ఉన్నాయి. దీంతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) విడుదల చేసిన ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ రిపోర్టులో ఈ విషయం స్పష్టమైంది.

ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు వెంటనే కేటాయించగల 30,749 హెక్టార్ల భూమి అందుబాటులో ఉంది. ఇది దాదాపు 75,980 ఎకరాలకు సమానం. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి పెద్ద పారిశ్రామిక రాష్ట్రాలను వెనక్కి నెట్టి, తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.

దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వాడలను కేంద్ర ప్రభుత్వం జీఐఎస్ ఆధారంగా మ్యాపింగ్ చేసింది. ఈ మ్యాపింగ్‌లో తెలంగాణలో మొత్తం 157 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నట్లు వెల్లడైంది. ఈ పార్కుల పరిధిలో మొత్తం 32,033 హెక్టార్ల భూమి ఉండగా, అందులో ఎక్కువ భాగం ఇప్పటికే పరిశ్రమల కోసం రెడీగా ఉందని నివేదిక చెబుతోంది.

పెట్టుబడిదారులు స్థలం కోసం వెతుక్కునే పరిస్థితి లేకుండా, ప్రభుత్వం ముందే భూములను సిద్ధం చేయడమే తెలంగాణకు ఈ ఆధిక్యం తెచ్చిందని అధికారులు చెబుతున్నారు. లిటిగేషన్లు లేని క్లియర్ టైటిల్ భూములతో, ప్లగ్ అండ్ ప్లే విధానంలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండటమే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.

ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ ల్యాండ్ బ్యాంక్ ఎంత బలంగా ఉందో నివేదిక స్పష్టంగా చూపించింది. మహారాష్ట్రలో 523 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నప్పటికీ, అక్కడ అందుబాటులో ఉన్న భూమి సుమారు 48,575 ఎకరాలు మాత్రమే. తమిళనాడులో 40,255 ఎకరాలు, గుజరాత్‌లో 31,147 ఎకరాలు మాత్రమే లభ్యతలో ఉన్నాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 638 పార్కులు ఉన్నా, తక్షణ వినియోగానికి 26,555 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

కేవలం భూమి ఉండటం మాత్రమే కాకుండా, ఏ రంగానికి ఎక్కడ అనుకూలమో ప్రభుత్వం ముందే గుర్తించి క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తోంది. ఫార్మా సిటీ, లైఫ్ సైన్స్ రంగాలకు ప్రత్యేక కాలుష్య రహిత జోన్లు, జహీరాబాద్, సీతారాంపూర్ ప్రాంతాల్లో ఈవీ, ఆటోమొబైల్ పరిశ్రమల కోసం భారీ భూములు కేటాయించారు. మహేశ్వరం, ఆదిభట్ల ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీకి భూములు సిద్ధంగా ఉన్నాయి. టెక్స్‌టైల్ రంగానికి వరంగల్ వైపు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భూములను ప్రభుత్వం మార్క్ చేసింది. ఈ విధంగా రంగాల వారీగా భూములను విభజించడంతో ఒకేచోట అనుబంధ పరిశ్రమలు ఏర్పడి పూర్తి ఎకోసిస్టమ్ అభివృద్ధి అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు ఈ ల్యాండ్ బ్యాంక్ ప్రధాన బలం కానుంది. తాజా నివేదిక ప్రకారం ఫ్యూచర్ సిటీ ప్రాంతం తెలంగాణలోనే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ జోన్‌గా అవతరించింది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ‘వర్క్, లివ్, ప్లే’ కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, రోబోటిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి అత్యాధునిక టెక్నాలజీ పరిశ్రమలకు వేల ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రీన్ ఇండస్ట్రీస్‌కు ప్రాధాన్యం ఇస్తూ, కాలుష్య కారక పరిశ్రమలకు తావు లేకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.

భూములతో పాటు రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు సిద్ధంగా ఉండటం వల్ల ఇన్వెస్టర్లు త్వరగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది. సాధారణంగా భూసేకరణకే ఏళ్ల తరబడి సమయం పడే పరిస్థితి ఉండగా, తెలంగాణలో మాత్రం ఎంవోయూ కుదిరిన నెల రోజుల్లోనే పనులు ప్రారంభించే అవకాశం ఉండటం పెద్ద అడ్వాంటేజ్‌గా మారింది.

ఇప్పుడు విడుదలైన ఈ నివేదిక, త్వరలో జరగనున్న దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చనుంది. ‘భూమికి కొదవ లేదు, అనుమతులకు ఆలస్యం లేదు’ అనే సందేశంతో గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భారీ ల్యాండ్ బ్యాంక్‌తో తెలంగాణ పెట్టుబడుల హబ్‌గా మరింత వేగంగా ఎదిగే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..