తెలంగాణ ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో స్పాట్ ఆడ్మిషన్లు.. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక కౌన్సెలింగ్
ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల భర్తీకి ప్రత్యేక స్పాట్ కౌన్సెలింగ్ చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
Degree spot Admissions : తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం స్పాట్ ఆడ్మిషన్లకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల భర్తీకి ప్రత్యేక స్పాట్ కౌన్సెలింగ్ చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇప్పటివరకు భర్తీ కాని సీట్లను స్పాట్ ఆడ్మిషన్ల ద్వారా పూర్తి చేయాలని భావిస్తోంది.
ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి శనివారం తెలిపారు. ఇంతవరకు దోస్త్ ద్వారా ప్రవేశాలు పొందనివారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఆప్షన్లు ఇవ్వనివారు, ఆప్షన్లు ఇచ్చినా సీటు దక్కనివారు ఇందులో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. కాలేజీల్లో సీటు ఖరారైనవారు ఆయా కాలేజీలోనే సబ్జెక్టులను మార్చుకునేందుకు మరో అవకాశం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో కళాశాలలు ప్రత్యేక స్పాట్ కౌన్సెలింగ్ చేపట్టచ్చని తెలిపారు.