AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వనదేవతల జాతరలో చిన్నారులు, దివ్యాంగులకు పోలీస్ ‘రిస్ట్‌ బ్యాండ్లు’.. ఎందుకో తెలుసా..?

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ప్రసిద్ధి చెందింది. మహా జాతరకు వచ్చే భక్తుల భద్రతకు తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, దివ్యాంగుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పిల్లలు, దివ్యాంగులు తప్పిపోతే వారి ఆచూకీని తక్షణమే కనిపెట్టేందుకు కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టారు.

వనదేవతల జాతరలో చిన్నారులు, దివ్యాంగులకు పోలీస్ ‘రిస్ట్‌ బ్యాండ్లు’.. ఎందుకో తెలుసా..?
Qr Wristbands For Safety
Vijay Saatha
| Edited By: |

Updated on: Jan 24, 2026 | 9:11 PM

Share

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ప్రసిద్ధి చెందింది. మహా జాతరకు వచ్చే భక్తుల భద్రతకు తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, దివ్యాంగుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పిల్లలు, దివ్యాంగులు తప్పిపోతే వారి ఆచూకీని తక్షణమే కనిపెట్టేందుకు కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టారు.

తప్పిపోయిన వారిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ‘చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ (సిటిఎంఎస్) తీసుకువచ్చారు. రిస్ట్ బ్యాండ్లు అద్భుతంగా పనిచేస్తాయని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి అన్నారు. శనివారం (జనవరి 24) తన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ సహకారంతో రూపొందించిన ఈ వినూత్న క్యూఆర్ కోడ్ ఆధారిత రిస్ట్ బ్యాండ్లను, సంబంధిత పోస్టర్లను ఆయన లాంచనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. జనవరి 28వ తేదీ నుంచి 31 వరకు ములుగు జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే మేడారం జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని డీజీపీ వివరించారు. ఇంతటి భారీ రద్దీలో చిన్న పిల్లలు, వయోవృద్ధులు, దివ్యాంగులు తప్పిపోయే అవకాశం ఉంటుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వారి భద్రతను పటిష్టం చేయడానికే ఈ సాంకేతికతను తీసుకొచ్చామని డీజీపీ శశిధర్ రెడ్డి తెలిపారు.

ఎస్ఐబీ ఐజీ పిబి సుమతి గత ఒకటిన్నర నెలలుగా కష్టపడి ఈ విధానాన్ని సిద్ధం చేశారని, దీనిని రూపొందించడంలో వొడాఫోన్ యాజమాన్యం అందించిన సహకారం అభినందనీయమని డీజీపీ కొనియాడారు. మహిళా భద్రత విభాగం డీజీ చారుసిన్హా పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని జాతరలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. భవిష్యత్తులో మహా కుంభమేళా వంటి ఇతర భారీ ఉత్సవాల్లో కూడా ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చని డీజీపీ అభిప్రాయపడ్డారు.

ఈ సీటీఎంఎస్ విధానం ద్వారా జాతరకు వచ్చే పిల్లలు, దివ్యాంగుల వివరాలను నమోదు చేసి వారి చేతికి ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్‌ను కడతారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లోని బృందాలు పిల్లల పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తప్పిపోయి కనిపిస్తే, అక్కడి వాలంటీర్లు లేదా పోలీసు సిబ్బంది తమ స్మార్ట్‌ఫోన్‌లతో ఆ బ్యాండ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. వెంటనే వారి తల్లిదండ్రుల లేదా సంరక్షకుల ఫోన్ నంబర్లు, డయల్ 100 వివరాలు కనిపిస్తాయి. దీంతో తక్షణమే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, సురక్షితంగా అప్పగించే అవకాశం ఉంటుంది. అనంతరం వారు కుటుంబంతో కలిసిన ఫోటోను కూడా సిస్టమ్‌లో అప్‌లోడ్ చేస్తారని డీజీపీ వివరించారు.

ఈ కార్యక్రమం కోసం మొత్తం 25,000 రిస్ట్ బ్యాండ్లను అందుబాటులో ఉంచారు. ఇవి జనవరి 27 నుంచి 31 వరకు 24 గంటల పాటు పనిచేసే 11 కేంద్రాల్లో లభిస్తాయి. హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్, హైదరాబాద్‌లోని ఉప్పల్ బస్ స్టేషన్, ఎంజీబీఎస్, కరీంనగర్, పరకాల, పెద్దపల్లి, మంథని, ఏటూరునాగారం, కాటారం బస్ స్టేషన్లతో పాటు వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. స్థానిక పోలీసు సిబ్బంది, మహిళా భద్రత విభాగం, టీజీఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది సమన్వయంతో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరైనా క్యూఆర్ కోడ్ బ్యాండ్ ధరించిన వ్యక్తి ఒంటరిగా కనిపిస్తే వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీజీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..