Telangana Police: తెలంగాణలో మాస్క్ లేకపోతే బాదుడే.. ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా?
wearing masks: కోవిడ్ నిబంధనలను సరిగా పాటించకపోవడంతోనే మహమ్మారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని పలువురు నిపుణులు,
Wearing Masks: కోవిడ్ నిబంధనలను సరిగా పాటించకపోవడంతోనే మహమ్మారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని పలువురు నిపుణులు, ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. కరోనా తీవ్రత భారీగా ఉన్నప్పటికీ.. చాలామంది ఇంకా నిబంధనలు పాటించడంలో అలసత్వం వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో కూడా కరోనా వ్యాప్తి పెరిగిపోతుండటంతో.. ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. ఎవరైనా మాస్కు ధరించకపోతే రూ.1,000 జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వ ఆదేశాలను పోలీసులు పకడ్భందీగా అమలు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారికి తగిన బుద్ధి చెబుతూ.. రూ.వేయి జరిమానా విధిస్తున్నారు. అయితే.. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలవుతున్నాయి. అయితే.. 5 నుంచి 11వ తేదీ ఉదయం 11గంటల వరకు సుమారు 6,500 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
పోలీసులు కేసులు విధించిన వారిలో అత్యధికమంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారే ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో కలిపి మాస్క్‌లు ధరించని సుమారు 3,214 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,478 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ తరువాత అత్యధికంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో 938, వరంగల్‌లో 218 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు జిల్లాల వారీగా చూస్తే.. సంగారెడ్డిలో 349 కేసులు, కామారెడ్డిలో 272 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా జిగిత్యాల, భూపాలపల్లి, వనపర్తిలో ఒక్కో కేసు చొప్పున నమోదు కాగా.. నారయణపేట జిల్లాలో అస్సలు కేసులు నమోదు కాకపోవడం గమనార్హం.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
మాస్కు పెట్టుకోని వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద జరిమానా విధించడమే కాకుండా వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఇకపై ఈ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: