Errabelli: ‘రైతులను ప్రేమించేది ఇద్దరే..! మొదటి వ్యక్తి ఎన్టీఆర్.. ఎదురు పెట్టుబడి ఇచ్చిన ఘనుడు కేసీఆర్’
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మారాయన్నారు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని..
NTR – KCR – Palle and Pattana Pragati: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మారాయన్నారు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి ఆదర్శ ముఖ్యమంత్రిని చూడలేదని మరోసారి వ్యాఖ్యానించారు ఎర్రబెల్లి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెంలో 3.73 కోట్లతో నిర్మించనున్న బిటి రోడ్ నిర్మాణ పనులకు ఎర్రబెల్లి శంకుస్థాపన చేశారు. రైతులను ప్రేమించేది ఇద్దరేనని.. ఒకరు ఎన్టీఆర్ అయితే.. రెండో వ్యక్తి కేసీఆర్ అన్నారు ఎర్రబెల్లి. రైతుల కోసం ఎన్టీఆర్ అనేక పథకాలు పెడితే.. సీఎం కేసీఆర్ రైతులకు ఎదురు పెట్టుబడి ఇచ్చారని అన్నారు.
పల్లెప్రగతి పథకం నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలుతప్పవని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వారంరోజుల్లోగా ఆ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. హరితహారం కింద ఇంటింటికి ఇచ్చిన ఆరు మొక్కలను సంరక్షించకపోతే ఆ ఇంటికిప్రభుత్వ సంక్షేమ పథకాలు రెండునెలలపాటు నిలిపివేస్తామని హెచ్చరించారు. మొక్కలు పెంచే విషయంలో నిర్లక్ష్యంగా ఉండే ఇంటి యజమానుల పట్ల కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా అంతటా రోడ్లపక్కన పెద్ద మొక్కలను కొనుగోలు చేసి నాటించాలని, లేకుంటే డీపీవోపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇళ్లపైనుంచి వెళుతున్న విద్యుత తీగలు, ఒరిగిపోయిన స్తంభాల విషయంలో విద్యుత్ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. పదిరోజుల్లో వాటిని సరిచేయాలని ఆదేశించారు. గ్రామంలో ఇంకా ఖాళీ ప్లాట్లలో చెత్తాచెదారం ఎందుకు ఉందని మంత్రి ప్రశ్నించారు. ఖాళీ ప్లాట్లలోని చెత్తాచెదారం తొలిగించి, ప్లాటు యజమానికి రూ.1000నుంచి రూ.10వేల వరకు జరిమానా వేయాలని ఆదేశించారు.