AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crimes City – Warangal: అక్రమార్కులకు అడ్డగా ఓరుగల్లు మహానగరం.. భయంతో వణికిపోతున్న వరంగల్ ప్రజలు..!

Crimes City - Warangal: తెలంగాణలో రెండో అతి పెద్దనగరం ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారుతోందా..? అభివృద్ధి మాట అటలా పక్కన పెడితే నేరస్తులు- మాఫియా ముఠాలు జడలు విప్పుతున్నాయా..?

Crimes City - Warangal: అక్రమార్కులకు అడ్డగా ఓరుగల్లు మహానగరం.. భయంతో వణికిపోతున్న వరంగల్ ప్రజలు..!
Crime
Shiva Prajapati
|

Updated on: Nov 30, 2021 | 6:55 AM

Share

Crimes City – Warangal: తెలంగాణలో రెండో అతి పెద్దనగరం ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారుతోందా..? అభివృద్ధి మాట అటలా పక్కన పెడితే నేరస్తులు- మాఫియా ముఠాలు జడలు విప్పుతున్నాయా..? అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.. వరుస సంఘటనలు. ఈ ఘటనలు వరంగల్ నగర వాసులకు వణుకు పుట్టిస్తున్నాయి. నేరస్తులకు ఓరుగల్లు కేరాఫ్‌గా మారడానికి కారణాలేంటీ..? ప్రత్యేక కథనం మీకోసం..

డ్రగ్స్ మాఫియా.. డ్రగ్స్ ముఠాలు, గంజాయి మాఫియాగాళ్లు, ఆన్ లైన్ బెట్టింగ్ మాఫియా, దారిదోపిడి దొంగలు.. ఇలా నేరస్థులకు వరంగల్ మహా నగరం అడ్డాగా మారింది. రెండు నెలల వ్యవధిలో జరిగిన కొన్ని ఘటనలు వరంగల్ వాసులకు వణుకు పుట్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న డ్రగ్స్ ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆరు రకాల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌లోని ఓ ప్రతిష్టాత్మక విద్యాలయాన్ని టార్గెట్ చేసుకుని డ్రగ్స్ ముఠాలు చెలరేగినట్టు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో వరంగల్ నగరంలో కలకలం రేగింది.

గంజాయి మాఫియా.. డ్రగ్స్ కేసుకంటే ముందు వరంగల్ గంజాయి మాఫియాకు అడ్డాగా ఉంది. ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రం నుంచి వరంగల్ గంజాయి చేర్చి.. ఇక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తోపాటు ఉత్తరాది రాష్ట్ర్రాలకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు ట్రక్కుల కొద్దీ గంజాయినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయినా గంజాయి స్మగ్లర్లు తీరు మార్చుకోలేదు. తరచూ ఎక్కడో ఓచోట గంజాయి పట్టుబడుతూనే ఉంది.

అంతరాష్ట్ర దొంగలు.. డ్రగ్స్, గంజాయి ముఠాలే కాదు.. అంతరాష్ట్ర్ర దారి దోపిడీ దొంగలు కూడా వరంగల్ నే టార్గెట్ చేశారు. వారం రోజుల క్రితం హనుమకొండ నక్కలగుట్ట ప్రాంతంలోని హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంకు వద్ద పట్టపగలే రూ. 25 లక్షలు లూఠీ చేశారు. బ్యాంకులో డ్రా చేసిన నగదును ఓ వ్యక్తి కారులు పెట్టిన నిమిషాల వ్యవధి లోనే కారు అద్దాలు ధ్వంసంచేసి డబ్బును మాయం చేశారు. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అయినా బ్యాంకులో రూ. 25 లక్షల రూపాయలు డ్రా చేసుకుని కారులో పెట్టి, మరల బ్యాంకుకు వెళ్లివచ్చేలోగా ప్రదాన రహాదారి పైనే అందరు చూస్తుండగానే కారు అద్దాలు పగలగొట్టి నగదు బ్యాగు పట్టుకుని పరారీ అయ్యారు. అయితే, బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. బాధితులు పోలీసులకు ఫోన్ చేప్పిన వెంటనే.. నిఘా బృందాలు, పెట్రోలింగ్ టీమ్ లను అప్రమత్తం చేసి గాలించారు. కానీ ఫలితం దక్కలేదు. చోరీ జరిగిన గంట వ్యవధిలోనే ఆ దొంగలు రాష్ట్రం విడిచి పారిపోయారు.

ఇక దారిదోపిడీలు- ఆన్ లైన్ దోపిడీ లే కాదు తాళాలువేసి ఉన్న ఇళ్లను కూడా వదలడం లేదు దుండగులు. ధనవంతుల ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ పోలీస్ లకు సవాల్ విసిరుతున్నారు. నిఘా కెమెరాలున్నా, పక్కా ప్రణాళికతో వాటికి చిక్కకుండా అపహరణలకు పాల్పడుతున్నారు. ఇళ్లనే కాదూ డబ్బులు అవసరాల కోసం బ్యాంకులకు వచ్చే వారి పై నిఘా పెట్టి డబ్బులు డ్రా చేసుకుని తీసుకుని వెల్లే వారిని టార్గెట్ చేసి అపహరించుకుని పోతున్నారు. ఇలా ఈ నాలుగు నెలల కాలంలో 15 చోట్లకు పైగా దొంగతనాలకు పాల్పడటంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ కారణంగా డబ్బులు, బంగారం అభరణాలు తీసుకుని బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. రెండు నెలల క్రితం హనుమకొండ వడ్డేపల్లి ప్రాంతంలోని పీజీఆర్ అపార్ట్‌మెంట్ లో బారీ చోరీ జరిగింది. అపార్ట్‌మెంట్లో దొంగలు పడి ఓ ఫ్లాట్ లోని మూడు కిలోలకు పైగా బంగారం, లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఇదే అపార్ట్‌మెంట్ లో ఓ ఏసీపీ, ఇద్దరు సీఐలు కూడా నివాసం ఉండటం విశేషం.

ఈ దోపిడీలన్నీ అంతర్ రాష్ట్ర దొంగలపనే అని గుర్తించిన పోలీసులు.. వారి కోసం వేట ముమ్మరం చేశామంటున్నారు. వరంగల్ నగరం ఉత్తర భారత దేశానికి- దక్షిణ భారత దేశానికి మధ్య వారధిగా ఉండడంతో నేరస్తుల రైలు మార్గాల్లో వచ్చి దోపిడీలకు పాల్పడుతూ సులభంగా పారిపోతున్నారని వరంగల్ సీపీ తరుణ్ జోషి చెబుతున్నారు. అయితే, ఇలాంటీ ఘటనలు జరిగినప్పుడు భాదితుల పిర్యాదు మేరకు పోలీసులు హడాహుడీ చేస్తున్నారు. ఆ తరువాత శరా మాములే అన్నట్లు తయారైంది. పోలీసులు గస్తీ పెంచక పోవటం, సీసీ కెమరాలు ఏర్పాటు చేసినప్పటకి.. అవి సక్రమంగా పని చేయకపోవడంతో అంతర్ రాష్ట్ర దొంగలు రెచ్చిపోయి పోలీస్ లకు సవాల్ విసురుతున్నారు.

బెట్టింగ్ మాఫియా.. ఒకవైపు దొంగల రెచ్చిపోతుంటే.. తాజాగా వరంగల్ కేంద్రంగా జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా గుట్టరట్టుచేశారు పోలీసులు. ఆన్ లైన్ లో బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు కోట్ల ఐదు లక్షల 14వేల రూపాయలు స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఇలా దినదినాభివృద్ధి చెందుతున్న వరంగల్ మహానగరంలో నేరాల సంఖ్య కూడా అదేవిధంగా పెరుగుతోంది. మాఫియా ముఠాలు, అంతరాష్ట్ర దోపిడీ గ్యాంగ్ లు నగరంలో రెచ్చిపోతున్నాయి. పోలీసులు పసిగట్టే లోపే రాష్ట్రం విడిచి పారితున్నారు. వరంగల్ అంటేనే వణుకుపుట్టే పరిస్థితి వచ్చింది. ఇకపై నగర ప్రజల భద్రతపై పోలీసులు గట్టి నిఘా పెట్టాల్సిన అవసరం వుంది.

Also read:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధర.. 10 గ్రాములపై ఎంత తగ్గిందంటే..

Twitter Gets New CEO – Parag Agrawal: భార‌తీయుడికి ట్విట్టర్ పగ్గాలు.. సీఈవోగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలు..

Health Tips: రోజూ ఇలా బ్రెష్ చేయకుంటే గుండె జబ్బులు తప్పవు.. తాజా పరిశోధనల్లో సంచలనాలు..