Voter Enrollment: ఓటరు జాబితాలో మార్పులు చేయించుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇవాళే ఆఖరు తేదీ!
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులతో పాటు నూతన ఓటరు నమోదు చేసుకునేందుకు మంగళవారంతో గడువు ముగియనున్నది.
Voter Enrolment Last Day: ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులతో పాటు నూతన ఓటరు నమోదు చేసుకునేందుకు మంగళవారంతో గడువు ముగియనున్నది. 2021 సంవత్సరానికి చెందిన ముసాయిదా ఓటరు జాబితాను భారత ఎన్నికల సంఘం నవంబర్ 1న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితాలో పేరు, అడ్రస్‌కు సంబంధించి మార్పులు చేర్పులు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అలాగే, కొత్త ఓటరు తమ పేర్లను నమోదు చేసుకునేవారు కూడా మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కూడా ముందుగానే ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఎన్నికం సంఘం పేర్కొంది. ఇందుకోసం నియోజకవర్గ ఈఆర్‌ఓ (డిప్యూటీ కమిషనర్ కార్యాలయం)కు కానీ, www.nvsp.in, ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ నగరవాసులను కోరారు.
భారత ఎన్నికల సంఘం ఓటరు ముసాయిదాకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 1వ తేదీన 2022 ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. అదే రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈ నెల 30వ తేదీ వరకు ముసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవసరమైతే కొత్తగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ పిలుపునిచ్చింది.
ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లను సీఈఓ ఆదేశించారు. మార్పులు, చేర్పులకు వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 20వ తేదీ వరకు పరిశీలించి, పరిష్కరించాలని నిర్ణయించారు. ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన 2022 సంవత్సరానికి తుది ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. ఈ షెడ్యూల్ మేరకు రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకొని పని చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే, 18 ఏళ్లు నిండినవారు నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని, ఓటరు జాబితాలో నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించేందుకు డబుల్ ఓటరుగా నమోదు అయినవారు ఫారం 7 ద్వారా, ఓటరు జాబితాలో తప్పులు సరిచేసుకోవడం కొరకు ఫారం 8 ద్వారా, ఒకే నియోజకవర్గంలో ఇతర అడ్రెస్‌కు మార్పు చేసుకొనుటకు ఫారం 8ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు ముసాయిదా ఓటరు జాబితాతో అందుబాటులో ఉండి దరఖాస్తు స్వీకరిస్తారని ఎన్నికల సంఘం వెల్లడించింది.