Municipal Elections 2026: పార్టీ ఇచ్చే బీ ఫారంపై సిరాతో సంతకం చేయకపోతే ఏమవుతుంది..?
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మున్సిపల్ ఎన్నికల సందడి కనిపిస్తోంది. మునిసిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ప్రతి ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ బీ ఫారం పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కీలకమైన బీఫామ్ పై సంతకం ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీల ఆశావాహులు నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన పార్టీకి చెందిన అభ్యర్థులకు కీలకమైన బీఫామ్ ను పార్టీ అందిస్తుంటుంది. బీఫారం అంటే… గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరేనని గుర్తించేలా ఇచ్చేదే ‘బీ’ ఫారం. నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల అధికారులకు ఈ ఫారాన్ని దాఖలు చేస్తేనే పార్టీకి సంబంధించి ఎన్నికల గుర్తును సదరు అభ్యర్థికి కేటాయిస్తారు. పార్టీ అధ్యక్షుడు, ప్రత్యేకంగా నియమితులైన ప్రతినిధుల ద్వారా బీ ఫారాన్ని అందిస్తారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చే ఆథరైజేషన్ ప్రతినిధి పేరిట పార్టీ ఇచ్చే ఏ ఫామ్ గత నెల 30వ తేదీన ఎన్నికల అధికారులకు సమర్పించారు.
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది ఆశావాహులకు పార్టీలు ఇచ్చే బీఫామ్ పై చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్ ఎంతో కీలకమైనది. బీ-ఫారం పొందిన వ్యక్తికే ఆ పార్టీ గుర్తును రిటర్నింగ్ అధికారి కేటాయిస్తారు. బీ-ఫారం చెల్లుబాటు కాకపోతే ఆ అభ్యర్థి ‘స్వతంత్ర గుర్తు’ దక్కుతుంది. పార్టీ ఆర్థరైజ్ చేసిన ప్రతినిధి బీ-ఫారంపై తన సంతకం ‘సిరా’తో చేస్తేనే చెల్లుబాటు అవుతుంది.
సిరాతో మాత్రమే సంతకం చేయాలని ఎన్నికల సంఘం నిబంధన విధించింది. పార్టీ ఆర్థరైజ్ చేసిన వ్యక్తి బి ఫామ్ లపై సాధారణ బాల్ తో సంతకం చేస్తే తిరస్కరణకు గురవుతోంది. పార్టీ ప్రతినిధి బీ-ఫారంపై తన సంతకం ఉన్న రబ్బరు స్టాంపు వేసినా, ఫ్యాక్స్ ద్వారా పంపినా అంగీకరించరు. బి ఫామ్ పై సిరాతో సంతకం చేయకపోతే ఆ అభ్యర్థికి పార్టీ గుర్తు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే బీ ఫామ్ జారీల విషయంలో పార్టీలు ఎన్నో జాగ్రత్తలు చర్యలు తీసుకుంటాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
