AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మున్సిపోల్స్‌కు కౌంట్‌డౌన్.. రంగంలోకి రేవంత్, కేటీఆర్.. గెలుపు కోసం మాస్టర్ ప్లాన్స్..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నోటిఫికేషన్ రావడమే ఆలస్యం..దూసుకుపోతామని ప్రధాన పార్టీలు అంటున్నాయి. అటు ఎన్నికల సంఘం.. ఈ బిగ్‌ ఫైట్‌కు చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అధికార యంత్రాంగానికి ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపోల్స్‌కు SEC చేస్తున్న ఏర్పాట్లు ఏంటి..? ప్రధాన పార్టీల సన్నాహాలు ఎలా ఉన్నాయి..? అనేది తెలుసుకుందాం..

Telangana: మున్సిపోల్స్‌కు కౌంట్‌డౌన్.. రంగంలోకి రేవంత్, కేటీఆర్.. గెలుపు కోసం మాస్టర్ ప్లాన్స్..
Telangana Municipal Elections
Krishna S
|

Updated on: Jan 20, 2026 | 7:01 AM

Share

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసిన ఎన్నికల సంఘం..త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. గడువు పూర్తయిన 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లు, 2 వేల 996 వార్డులు, డివిజన్లలో వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని మేడారంలో జరిపిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఎస్‌ఈసీకి అధికారికంగా క్లియరెన్స్ లేఖ అందనుంది.

మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాలతో పాటు పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులకు మాత్రమే మొబైల్ ఫోన్లు వాడేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లకు మొబైల్ అనుమతి లేదని..ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్దంగా నిర్వహించేందుకే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే జిల్లాల బాట మొదలుపెట్టగా మంత్రులు సైతం జిల్లాలను చుట్టేస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇప్పటికే సీఎం రేవంత్‌ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంట్ బాధ్యత ఒక్కో మంత్రికి అప్పగించారు. పార్లమెంట్ సెగ్మెంట్‌లలో మున్సిపాలిటీల వారిగా ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని ఆదేశించారు. ఇక అభ్యర్థుల ఎంపికపై పీసీసీ స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేసింది. టికెట్ల ఎంపికలో కమిటీలదే కీలక పాత్ర అని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇప్పటికే తేల్చిచెప్పేశారు. అటు బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికలకు సై అంటోంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటామని..మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామ కమలం నేతలు చెబుతున్నారు.

ఇక పంచాయతీ ఎన్నికల్లో సెకండ్‌ ప్లేస్‌లో నిలిచిన బీఆర్ఎస్.. పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జోరు చూపించాలని భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ పార్టీ ముఖ్యనేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తానికి నోటిఫికేషన్ రాకముందే మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.