Lucky Draw Scams: లక్కీ డ్రా అన్నారంటే ఇక లాకపే గతి.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు పోలీసుల మాస్ వార్నింగ్!
లక్కీ డ్రా, గివ్ అవే పేరుతో ఖరీదైన బహుమతులు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రజలను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటివరకు ఏడుగురు ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించి, నోటీసులు జారీకి సిద్ధమయ్యారు. లక్కీ డ్రా లింకులు ఫోన్ హ్యాకింగ్‌కు దారితీసే అవకాశం ఉందని డీసీపీ హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై ఐటీ, ప్రైజ్ మనీ యాక్ట్‌ల కింద కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

లక్కీ డ్రా, గివ్ అవే పేరుతో ఖరీదైన వాహనాలు, స్థలాలు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారిపై దృష్టి పెట్టిన పోలీసులు ఇప్పటివరకు ఏడుగురు ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించారు. దర్యాప్తు పూర్తయ్యాక లక్కీ డ్రా పేరుతో మోసాలు చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. పోలీసుల చర్యలతో భయపడిన కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను డిలీట్ చేస్తున్నట్లు సమాచారం.
లక్కీ డ్రా మోసాలకు పాల్పడిన ఇన్‌ఫ్లుయెన్సర్ల అకౌంట్ వివరాలు, డబ్బు లావాదేవీలు, డిజిటల్ ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. పంజాగుట్టలో నమోదైన కేసును ఆధారంగా చేసుకుని ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్లందరినీ గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీవీ9తో మాట్లాడిన సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ దందా బంద్ కావడంతో కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రా పేరుతో కొత్త మోసాలకు తెరలేపుతున్నారని చెప్పారు. ప్రజల్లో ఉన్న అత్యాశను క్యాచ్ చేసుకుని ఫ్రాడ్ స్టార్స్ అమాయకులను బురిడీ కొడుతున్నారని తెలిపారు. లక్కీ డ్రా పేరుతో ప్రమోషన్ చేయడం నేరమని స్పష్టం చేశారు.
లక్కీ డ్రా లింక్స్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని డీసీపీ హెచ్చరించారు. ఈ తరహా మోసాలకు పాల్పడిన వారిపై ఐటీ యాక్ట్‌తో పాటు ప్రైజ్ మనీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. గివ్ అవే పేరుతో ఆకర్షణీయమైన బహుమతులు చూపించి ఒకసారి డబ్బులు వసూలు చేసి, మళ్లీ కొత్త ఆఫర్ అంటూ అదే తరహా మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఇలాంటి మోసాలపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
