JEE Mains: విద్యార్థులకు అలర్ట్..! రికార్డు స్థాయిలో దరఖాస్తులు..పరీక్షా షెడ్యూల్ చెక్ చేసుకోండిలా..
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థలైన ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో ప్రవేశాలకు, అలాగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించేందుకు నిర్వహించే జేఈఈ మెయిన్స్-2026 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో దరఖాస్తులు రావడంతో జాతీయ పరీక్షల సంస్థ (NTA) భారీ ఏర్పాట్లు చేసింది.

ఈసారి జేఈఈ మెయిన్స్‌కు దేశవ్యాప్తంగా దాదాపు 14.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. పెరిగిన రద్దీ దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఎన్‌టీఏ పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8 కేంద్రాలను పెంచి మొత్తం సంఖ్యను పెంచారు. తెలంగాణలో అదనంగా 3 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారని అంచనా.
పరీక్షా షెడ్యూల్ ఇదే:
పేపర్-1 (B.E/B.Tech) జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జరుగుతుంది.
పేపర్-2 (B.Arch/B.Planning): చివరి రోజున అంటే జనవరి 29న నిర్వహిస్తారు.
ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9:00 నుండి 12:00 వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది. ఉదయం షిఫ్ట్ విద్యార్థులను 7:30 – 8:30 మధ్య, మధ్యాహ్నం షిఫ్ట్ విద్యార్థులను 1:30 – 2:30 మధ్య మాత్రమే లోపలికి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు.
పరీక్షా కేంద్రానికి వచ్చే విద్యార్థులు ఈ క్రింది వాటిని తప్పనిసరిగా ఉంచుకోవాలి:
డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ప్రింటవుట్ (దీనిపై ఫోటో అంటించి, వేలిముద్ర వేయాలి). అటెండెన్స్ షీట్ కోసం ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో వెంట తెచ్చుకోవాలి. ఆధార్, పాన్ కార్డ్ లేదా దరఖాస్తులో పేర్కొన్న ఏదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ కాపీ వెంట ఉండాలి.పెద్ద బటన్లు ఉన్న చొక్కాలు ధరించకూడదు. సాధారణ దుస్తుల్లో రావాలని అధికారులు సూచించారు. తెలుగు, ఇంగ్లీష్ సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో కొత్త కేంద్రాలు:
ఏపీలో కొత్తగా ఆదోని, అమలాపురం, మదనపల్లి, మార్కాపురం, పుత్తూరు, రాయచోటి, తాడిపర్తి, తిరువూరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో కొత్తగా ఆదిలాబాద్, కోదాడ, పెద్దపల్లి జోడించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డులోని సూచనలను క్షుణ్ణంగా చదవాలని ఎన్‌టీఏ అధికారులు సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




