కొలువుదీరిన 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలు.. మహిళలదే హవా.. కొత్త మేయర్లు, డిప్యూటీ మేయర్లు.. చైర్మన్లు, వైస్ ఛైర్మన్లు వీరే..
తెలంగాణలో జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ప్రథమ పౌరులు కొలువుదీరారు.
Newly Elected Municipal Body: తెలంగాణలో జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ప్రథమ పౌరులు కొలువుదీరారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల కొత్త పాలకవర్గాలు ఏర్పడ్డాయి. కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మపర్సన్లు, వైస్ చైర్మన్ల ప్రమాణస్వీకార కార్యక్రమం కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా జరిగింది. బాధ్యతలు చేపట్టిన వారందరూ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన వారే కావడం విశేషం. అంతకుముందు కార్పోరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, టీఆర్ఎస్ ఎన్నికల పరిశీలకులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల పదవులు మహిళలకే దక్కాయి. ఇక సిద్దిపేట, కొత్తూరు మున్సిపాలిటీల చైర్‌పర్సన్ పదవులు మహిళలకు దక్కగా, జడ్చర్ల మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కూడా మహిళలకే వరించాయి. అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీల వైస్ చైర్మన్ పదవులను మహిళలు దక్కించుకున్నారు. మొత్తంగా ఈ రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో మహిళలకే పట్టాభిషేకం జరిగింది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గుండు సుధారాణి 29వ డివిజన్ నుంచి గెలుపొందగా, రిజ్వానా షమీమ్ 36వ డివిజన్ నుంచి గెలుపొందారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా, టీఆర్ఎస్ 48, బీజేపీ 10, కాంగ్రెస్ 4, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జోహ్రో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పునుకొల్లు నీరజ 26వ డివిజన్ నుంచి గెలుపొందగా, ఫాతిమా జోహ్రా 37వ డివిజన్ నుంచి గెలుపొందారు. ఖమ్మం మున్పిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 60 స్థానాలకు టీఆర్ఎస్ 45 డివిజన్లలో, కాంగ్రెస్ 10, ఇతరులు 5 డివిజన్లలో గెలుపొందగా, బీజేపీ ఒక డివిజన్‌లో మాత్రమే గెలిచింది.
సిద్దిపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కడవేర్గు మంజుల, వైస్ చైర్మన్‌గా కనకరాజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎన్నికల పరిశీలకులు వంటేరు ప్రతాప్ రెడ్డి, రవీందర్ సింగ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులకు గానూ టీఆర్ఎస్ 36, బీజేపీ 1, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. టీఆర్ఎస్ రెబల్స్ అందరూ మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎడ్ల నర్సింహ గౌడ్, వైస్ చైర్మన్‌గా శైలజా విష్ణువర్ధన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎడ్ల నర్సింహ గౌడ్ 16వ వార్డు, శైలజ 19వ వార్డు నుంచి గెలుపొందారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అచ్చంపేట మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గానూ టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ ఒక వార్డులో గెలిచారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీ రవీందర్, వైస్ చైర్‌పర్సన్‌గా సారికా రామ్మోహన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. లక్ష్మీ రవీందర్ 8వ వార్డు, సారికా 15వ వార్డు నుంచి గెలుపొందారు. జడ్చర్ల మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులు ఉండగా, టీఆర్ఎస్ 23, బీజేపీ రెండు, కాంగ్రెస్ రెండు వార్డుల్లో గెలిచింది.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా బాతుక లావణ్య యాదవ్, వైస్ చైర్మన్‌గా డోలీ రవీందర్ ప్రమాణస్వీకారం చేశారు. లావణ్య యాదవ్, డోలీ రవీందర్ 8, 12వ వార్డుల నుంచి గెలుపొందారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు గానూ, టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 వార్డుల్లో గెలిచింది.
నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్‌గా రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్‌పర్సన్‌గా శెట్టి ఉమారాణి ప్రమాణస్వీకారం చేశారు. రాచకొండ శ్రీనివాస్ 19వ వార్డు, శెట్టి ఉమారాణి 11వ వార్డు నుంచి గెలుపొందారు. నకిరేకల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా, 11 వార్డుల్లో టీఆర్ఎస్, రెండు వార్డుల్లో కాంగ్రెస్, ఇతరులు ఏడు వార్డుల్లో గెలుపొందారు.