AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణలో ఎవరెవరు ఏ స్థానంలో గెలిచారు.? మెజార్టీ ఎంతంటే.?

తెలంగాణలో మరోసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలే ఫలితాల రూపంలో నిజమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పగా.. అలాగే ఆ పార్టీ అధికారం చేపట్టింది. ఇప్పుడు అవే ఎగ్జిట్ పోల్స్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అని అంచనా వేశాయి.

Telangana: లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణలో ఎవరెవరు ఏ స్థానంలో గెలిచారు.? మెజార్టీ ఎంతంటే.?
Telangana Election Results
Ravi Kiran
|

Updated on: Jun 04, 2024 | 5:11 PM

Share

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌-బీజేపీ మధ్య టైట్‌ ఫైట్‌ నడిచింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్‌- బీజేపీ మధ్య చివరి వరకూ హోరాహోరీ నడిచింది. చెరో 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక ఎప్పటిలాగే మజ్లిస్‌ కంచుకోట హైదరాబాద్‌ను MIM దక్కించుకుంది. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. విపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ ఎక్కడా ప్రభావం చూపకపోవడం గులాబీశ్రేణులను తీవ్రనిరాశలోకి నెట్టేసింది.

తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 8 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అందులో పెద్దపల్లి, జహీరాబాద్‌, వరంగల్‌, మహబూబాబాద్, ఖమ్మం, భువనగిరి, నల్గొండ, నాగర్‌కర్నూలులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక తెలంగాణలో కాషాయం పార్టీ గతంలో కన్నా మెరుగైన స్థానాలను చేజిక్కించుకుంది. 2019లో కేవలం నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ, ఈసారి 8 స్థానాలను కైవసం చేసుకుంది. కరీంనగర్‌, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.

తెలంగాణ పార్లమెంట్‌ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ డబుల్ డిజిట్‌ సాధించాలన్న ప్రయత్నాలను..మోదీ వేవ్‌తో కమలం పార్టీ దెబ్బకొట్టింది. అనూహ్యంగా సీట్ల సంఖ్యను పెంచుకుంది బీజేపీ. గతంలో జంటనగరాలు, రంగారెడ్డిజిల్లాలో సికింద్రాబాద్‌ ఎంపీ స్థానాన్ని మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. ఈసారి సికింద్రాబాద్‌తో పాటు మల్కాజ్‌గిరి, చేవెళ్ల స్థానాలను సైతం కైవసం చేసుకుంది. ఇక హైదరాబాద్‌లో గట్టి అభ్యర్థిని బరిలో నిలిపినా… ఎప్పటిలానే MIM తన పట్టు నిలుపుకుంది. కాగా, తెలంగాణలోని పార్లమెంట్ స్థానాల ఫలితాలను చూస్తే కాంగ్రెస్‌కు 40.5%, బీజేపీకి 34.5%, బీఆర్ఎస్‌కు 17.4% ఓట్ల శాతం దక్కినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.

ఏ స్థానంలో ఎవరు గెలిచారంటే.?

– ఆదిలాబాద్‌‌లో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్‌ 78వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

– నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌ రెడ్డి 5.51లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.

– ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాం రెడ్డి 4.56లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.

– వరంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య 2.02లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు.

– మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ 3.24లక్షల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు.

– జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ 45వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

– భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి కిరణ్‌కుమార్‌ రెడ్డి 1.95లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.

– నాగర్‌కర్నూలులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి 85వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.

– నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ 1, 27, 769 ఓట్లతో మెజార్టీ విజయం సాధించారు.

– కరీంనగర్‌ లోక్‌సభ సీటు నుంచి బీజేపీ నేత బండి సంజయ్‌ 2.12లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.

– పెద్దపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.

– హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి మాధవీలతపై 2,97,031 ఓట్ల తేడాతో అసదుద్దీన్ ఓవైసీ ఘనవిజయం సాధించారు.

– మెదక్ జిల్లాలో కాషాయ జెండా ఎగిరింది. రఘునందన్ రావు సమీప అభ్యర్ధిపై అద్భుత విజయం సాధించారు.

– మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీ అభ్యర్ధి డీకే అరుణ సుమారు 3 వేల మెజార్టీతో విజయం సాధించారు.

– చేవెళ్లలో బీజేపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి లక్షా 50 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

– మల్కాజిగిరి నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ విజయకేతనం ఎగురవేశారు.

–  సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డి విజయం సాధించారు.