Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Elections: నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ పోలింగ్.. టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే…!

స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 MLC స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే, ఆరుగురు ఎమ్మెల్సీలు ఏక్ర‌గ్రీవం కాగా, మిగిలిన 6 స్థానాల‌కు శుక్రవారం ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి..

MLC Elections: నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ పోలింగ్.. టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే...!
Trs
Follow us
Balaraju Goud

| Edited By: Sanjay Kasula

Updated on: Dec 10, 2021 | 6:17 AM

Telangana MLC Elections 2021: స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 MLC స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే, ఆరుగురు ఎమ్మెల్సీలు ఏక్ర‌గ్రీవం కాగా, మిగిలిన 6 స్థానాల‌కు శుక్రవారం ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి.. ఈ ఆరు చోట్ల అధికార TRS పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. మిగిలిన ఆరు చోట్ల నేడు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఐదు జిల్లాల్లోనూ గులాబీ దళానిదే మెజార్టీ కనిపిస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్, మెద‌క్‌, న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ పోలింగ్‌కు సంబంధించి ఈసీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి మొత్తం 37 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 5,326 ఓట‌ర్లు ఉన్నారు. ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించ‌నున్నారు. పోలింగ్ కేంద్రాల‌కు సిబ్బంది చేరుకున్నారు. పోలింగ్ సెంట‌ర్ల‌లోకి సెల్‌ఫోన్ల అనుమ‌తి ఉండ‌దు. సీసీ కెమెరాల‌తో పాటు వెబ్ కాస్టింగ్ చేయ‌నున్నారు. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ఈ నెల 14న చేప‌ట్ట‌నున్నారు. అప్ప‌టి వ‌ర‌కు స్ట్రాంగ్ రూమ్‌ల వ‌ద్ద భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేయ‌నున్నారు.

ప్రస్తుత బలాబలాల ప్రకారం అధికార టీఆర్ఎస్ పార్టీ సువులుగా విజయం సాధిస్తుంది. ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను పోటీలో దింపింది. కరీంనగర్‌లో TRSకు రాజీనామా చేసిన మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ పోటీలో ఉండడం కొంత ఆసక్తి రేకెత్తిస్తోంది. విజయం ఖాయమైనప్పటికీ TRS జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఓటర్లు చేజారకుండా జిల్లాల వారీగా అందరినీ క్యాంపులకు తరలించింది. నేడు పోలింగ్ కావడంతో నిన్ననే ప్రజాప్రతినిధులు అందరూ జిల్లాలకు చేరుకున్నారు..

ఇక, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎన్నిక జరిగే ఒక స్థానానికి TRS నుంచి దండె విఠల్‌, స్వతంత్ర అభ్యర్థిగా పి.పుష్పరాణి పోటీ చేస్తున్నారు. మొత్తం 937 మంది ఓటర్లలో 717 మంది TRS పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే ఉండటం విశేషం. దీంతో ఆదిలాబాద్‌లో టీర్ఎస్ విజయం నల్లేరుపై నడకలా ఉంది. అటు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రెండు స్థానాల్లో TRS అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్‌.రమణ బరిలో ఉన్నారు. అయితే, ఇటీవలే TRS పార్టీకి రాజీనామా చేసిన రవీందర్‌సింగ్‌, మరో ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. జిల్లాలో 1,324 మంది ఓటర్లు ఉండగా ఇందులో TRS నేతలు 996 మంది. ఇక ఉమ్మడి ఖమ్మంలోని ఒక స్థానానికి TRS, కాంగ్రెస్‌ అభ్యర్థులు తాతా మధు, రాయల నాగేశ్వరరావులతో పాటు ఇండిపెండెంట్లు శ్రీనివాసరావు, సుధారాణి పోటీలో ఉన్నారు. మొత్తం 768 మంది ఓటర్లలో TRSకు 490, కాంగ్రెస్‌కు 116 ఓట్లు ఉన్నాయి.

అటు, ఉమ్మడి మెదక్‌ జిల్లా విషయానికి వస్తే TRS అభ్యర్థి వంటేరు యాదవరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి నిర్మల, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 1,026 మంది ప్రజాప్రతినిధుల్లో 777 మంది TRS వారు.. 230 మంది కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక స్థానానికి TRS నుంచి కోటిరెడ్డితో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 1,271 మంది ఓటర్లలో TRS కు చెందిన ప్రజాప్రతినిధులు 991 మంది ఉండటం విశేషం.

స్థానిక సంస్థల కోటాలో MLC ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు.

Read Also… Old Man Donated property: రూ.2 కోట్ల ఆస్తి జిల్లా కలెక్టర్‌కి రాసేసిన తండ్రి… కొడుకు షాక్‌..! వైరల్ అవుతున్న వీడియో..